ఏప్రిల్ లో విశాఖలో ప్రారంభం- దుర్భుద్ధితో చంద్రబాబు కుట్రలు : ప్రధానికి థాంక్స్ - సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో కీలక అంశాలను వెల్లడించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. పేదల పక్కా ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్చకు సీఎం జగన్ సమాధానమిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు 30.76 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తొలి విడతలో 15.60 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో 17 వేల కాలనీలు
ఇళ్ల పట్టాల కోసం 71,811 ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. రూ.25వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఇవాళ ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని చెప్పారు. 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశామని గుర్తు చేశారు.
తొలి దశలో 10 వేలకు పైగా జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ప్రతి కాలనీలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. పేదల ఇళ్లకు తక్కువ ధరకే సిమెంట్, స్టీలు అందిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు.

ప్రధాని మోదీకి ధన్యవాదాలు
వచ్చే డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. గతంలో టిడ్కో ఇళ్లపై పేదలు నెలకు రూ.3వేలు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ, ఈరోజు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషణ్ కూడా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే లక్షకుపైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. మరో 63వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
నిరుపేదలను ఇంటి యజమానులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని చెబుతూ..ప్రధాని మోదీకి సీఎం జగన్ ధన్యవాదాలు చెప్పారు.ప్రతి గ్రామ పంచాయతీలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందుబాటులో ఉన్నారు. ఇంటి నిర్మాణాలను బట్టి దశల వారిగా బిల్లుల చెల్లింపు చేస్తామని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు కుట్రలు చేసారంటూ
ఈ మహా యజ్ఞానికి ఆటంకం కలిగిచేందుకు టీడీపీ శాయశక్తులా కృషి చేశారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందని విఫరీతమైన దుర్భుద్ధితో కుట్రలు చేశారని విమర్శించారు. తాజాగా, విశాఖలో 1.80 లక్షల ఇళ్లకు ఇటీవలే కోర్టు క్లియరెన్స్‌ఇచ్చింది చెబుతూ.. ఏప్రిల్ లో పండుగ వాతావరణంలో అక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
తన సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా టీడీపీ నేతలు అడ్డుకుంటే కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో పనులు మొదలయ్యాయన్నారు. ఏప్రిల్‌లో పులివెందులలో ఇళ్ల పట్టాలు, ఇంటి నిర్మాణాలు మొదలవుతాయని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఎట్టి పరిస్థుల్లోనూ జగనన్న కాలనీల నిర్మాణాలు మాత్రం ఆగేది లేదని.. పూర్తి చేస్తామని సీఎం జగన్ సభలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications