ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ : ఇంధన సంక్షోభం పై చర్యలు చేపట్టండి - ఏపీలో 1-2 రోజుల బొగ్గుల నిల్వలే ఉన్నాయి..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాసారు. ఇంధన సంక్షోభం,విద్యుత్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదికి లేఖలో కీలక అంశాలను వెల్లడించారు. తక్షణం దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధానిని సీఎం జగన్ కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 185-190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని లేఖలో పేర్కోన్నారు. కోవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం మేర పెరిగిందని లేఖలో సీఎం వివరించారు. బొగ్గు కొరత దేశంలోని విద్యుత్ ప్లాంట్లను సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదముందని లేఖలో వెల్లడించారు.
రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్ కో ఏపీ విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేర మాత్రమే తీర్చగలుగుతోందని జగన్ వివరించారు. ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 1-2 రోజుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్టు సీఎం లేఖలో స్పష్టం చేసారు. బొగ్గు కొరత కారణంగా ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్ద్యంతోనే పనిచేస్తున్నాయని లేఖలో వివరించారు. రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు.

కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి కూడా రోజుకు 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి సాధ్యమవుతోందని సీఎం తెలిపారు. 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ఉన్న ఒప్పందాలను ఏపీ వినియోగించుకోలేని పరిస్థితి ఉందని లేఖలో సీఎం వివరించారు. బొగ్గు కొరత కారణంగా బహిరంగ మార్కెట్ లో ఇంధన థరలు గణనీయంగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసిన సీఎం..రియల్ టైమ్ విద్యుత్ కొనుగోళ్ల కారణంగా ప్రస్తుతం యూనిట్ ధర 20కి పెరిగిందని ప్రధానికి వివరించారు.
కొన్ని సార్లు ఈ ధరకు కూడా విద్యుత్ అందుబాటులో ఉండటం లేదని వెల్లడించారు. ఇవి డిస్కమ్ ల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముందని లేఖలో పేర్కోన్న సీఎం జగన్ తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. కోవిడ్ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగింది. గత ఒక్కనెలలోనే విద్యుత్ డిమాండ్ 20 శాతానికిపైగా పెరిగింది. విద్యుత్ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని'' సీఎం లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications