పిఠాపురంను చుట్టుముట్టిన జగన్ సైన్యం
పీఠాపురం.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికార వైసీపీ కూడా మరోసారి పవన్‌ను ఓడించి ఆయనకు రాజకీయంగా చెక్ పెట్టాలని భావిస్తోంది. పవన్‌ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది అధికార పార్టీ. పిఠాపురంలో పవన్‌ని ఓడించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు.

దీనిలో భాగంగా పిఠాంపురం ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబును క్యాంప్ కార్యాలయానికి పిలిచి మాట్లాడిన సీఎం జగన్ .. ఆయనకు పలు కీలక సూచనలు చేశారు. అభ్యర్థుల మార్పుల్లో భాగంగా పెండెం దొరబాబుకు ఈ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదు. దీంతో గురువారం పెండెం దొరబాబుతో చర్చించిన జగన్ ..పిఠాంపురంలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పిఠాపురం అభ్యర్ధి వంగా గీత వర్గంతో సమన్వయంతో కలిసి పనిచేసి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలన్నారు.అధికారంలోకి రాగనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పెండెం దొరబాబుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన వంగా గీత గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు.

ఇప్పటికే నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి సైతం పిఠాంపురం ప్రత్యేక బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. మిథున్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజీలు, ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మిథున్ రెడ్డి ఎంట్రీతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మరోవైపు జనసేనకు టీడీపీ నుంచి అనుకున్నంతస్థాయిలో మద్దతు లభించడం లేదు. దీంతో పిఠాపురంలో లెక్కలు మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి జగన్ తన సైన్యం మొత్తాన్ని రంగంలోకి దింపుతున్నారు.పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో పవన్ ఓటమే లక్ష్యంగా పిఠాపురంలో ప్రణాళికలు రచిస్తున్నారు.మరి పవన్‌ను ఓడించడానికి అధికార పార్టీ అమలు చేస్తున్న వ్యూహాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications