పార్టీ ముఖ్యులతో జగన్ భేటీ మారుతున్న లెక్కలు, కీలక నిర్ణయాలు..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం జగన్ ఎన్నికల నిర్ణయాలను వేగవంతం చేసారు. టీడీపీ, జనసేన అభ్యర్దుల జాబితా విడుదల కావటంతో నియోజకవర్గాల వారీగా పోటీ పైన స్పష్టత వస్తోంది. ఈ సమయంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన సీఎం జగన్ ఫోకస్ చేసారు. అభ్యర్దులంతా ప్రజల్లోనే ఉండాలని నిర్దేశించారు. ఈ సమయంలోనే పార్టీ నేతలో సమావేశం ఏర్పాటు చేసారు. కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
పార్టీ కేడర్ తో సమావేశం: ఎన్నికల పోరాటం ఏపీలో కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు సిద్దం సభలతో కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసిన వైసీపీ వచ్చే నెల 3న నాలుగో సిద్దం సభ నిర్వహించనునంది. అద్దంకి వేదికగా ఈ సభ జరగనుంది. ఇదే సమయంలో రేపు (మంగళవారం) సీఎం జగన్ పార్టీ నేతలో కీలక సమావేశం ఏర్పాటు చేసారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ముఖ్య నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. తాడేపల్లి లోని సికే కన్వెన్షన్ హాల్ లో ఈ సమావేశం జరగనుంది. దాదాపు రెండు వేల మంది పార్టీ మండల స్థాయి నేతలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లే విషయంలో కేడర్ కు పార్టీ అధ్యక్షుడిగా సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
జగన్ దిశా నిర్దేశం: ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా పలు నియోజకవర్గాల్లో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో..సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసిన విధానం వివరిస్తూ..అభ్యర్ది ఎవరైనా గెలుపుకు సహకరించాలని పార్టీ కేడర్ ను జగన్ కోరనున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక సమకరణాలే ఆధారంగా పార్టీలో పదవులు కేటాయించినట్లు జగన్ వివరించనున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికీ భవిష్యత్ ఉంటుందని జగన్ హామీ ఇస్తున్నారు. కొందరు పార్టీ మండల నేతల అభిప్రాయాలను చెప్పేందుకు వీలుగా ఈ సమావేశంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వారి అభిప్రాయాలను తెలుసుకొని సీఎం జగన్ వాటి పైన స్పందించనున్నారు.

ఎన్నికల కార్యాచరణ: ఎన్నికల కార్యాచరణ పైన జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమాన్ని వివరించటంతో పాటుగా భవిష్యత్ ప్రణాళికల పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెల 3న సిద్దం సభ తరువాత తొలి వారంలోనే అభ్యర్దుల ప్రకటన పూర్తి చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా ప్రతీ పోలింగ్ బూత్ కేంద్రంలో పార్టీలో 15 మందితో కమిటీలు ఏర్పాటు చేసారు.
ఆ కమిటీలు తమ పరిధిలోని ప్రతీ ఇంటితొ మమేకం అయ్యేలా దిశా నిర్దేశం చేసారు. ఇక..ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొనే కీలక నిర్ణయాల పైన జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అద్దంకి సిద్దం సభలో ఎన్నికల హామీలను ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో, పార్టీ నేతల సమావేశంలో జగన్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications