అమరావతిలో సీఎం జగన్ - నేడే కీలక ఘట్టం, ఉత్కంఠ..!!
అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనతో ఉత్కంఠ పెరుగుతోంది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్లను ఇవ్వాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా ఈ రోజు కీలక ఘట్టం జరగనుంది. ఇదే అంశం పైన హై కోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. కేంద్రం ముందుకు రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చింది. ఫలితంగా ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అమరావతిలో 50 వేల మందికి పైగా పేదల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
అమరావతికి సీఎం జగన్:భాగంగా.. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పలు సమస్యలను అధిగమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అమరావతిలో 1,402.58 ఎకరాల్లో 50,793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది. రూ.1,829.57 కోట్లతో 50 వేల మందికి పైగా పేదలకు సర్కారు స్థిర నివాసాలు కల్పించేలా సీఎం జగన్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు.

50 వేల ఇళ్లకు శంకుస్థాపన:ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్‌లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు.
సీఎం ఏం చెప్పబోతున్నారు:ఆర్-5 జోన్‌లో 6 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పేదలు కోటీశ్వరులు కావడం ఖాయమని, చంద్రబాబు కుళ్లి కుళ్లి ఏడ్వటం ఖాయమని వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్లు రాకూడదన్నదే టీడీపీ ప్రయత్నమని మండిపడ్డారు. పేదల ఇళ్ల కోసం ఏ స్థాయిలోనైనా మేం పోరాడుతామని స్పష్టం చేశారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు కొందరు పిలుపునిచ్చారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన, బహిరంగ సభలో సీఎం జగన్ చేసే ప్రసంగం పైన ఉత్కంఠ నెలకొంది. సీఎం అమరావతి వేదికగా ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications