ఢిల్లీకి సీఎం జగన్ - ఎన్నికల పిక్చర్ క్లియర్, మద్దతుపైనా..!!
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 27న ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తోనూ భేటీ అవుతారని సమాచారం. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ, జనసేన అటు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ పర్యటన..సమావేశాలకు ప్రాధాన్యత పెరిగింది.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన:ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. నీతి అయోగ్ సమావేశంలో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు..కేంద్రం సాయం.. ఏపీ కోరుకుంటున్న సహకారం.. పెండింగ్ అంశాలను సీఎం జగన్ ప్రస్తావించనున్నారు. అదే విధంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో వచ్చిన పెట్టుబడులు..మహిళా సాధికారిత కోసం చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు, కేంద్రం నుంచి సహాయాన్ని కోరనున్నారు. కీలక రంగాలకు సంబంధించి కొన్ని సూచనలను కూడా చేసేందుకు ముఖ్యమంత్రి సిద్దమవుతున్నారు. నీతి అయోగ్ లో చర్చించే అంశాలపైన అధికారులతో సీఎం జగన్ ఇప్పటికే సీమక్ష చేసారు.

ఏపీ రాజకీయాలపై చర్చ:ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు సీఎం జగన్.. కేంద్రంలోని ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్దికంగా కేంద్రం నుంచి తోడ్పాటు అందుతోంది. పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేస్తోంది. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు కోసం టీడీపీ, జనసేన ప్రయత్నం చేస్తున్నాయి.వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని పవన్ చెబుతున్నారు. ఈ సమయంలో జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, ఇప్పుడు టీడీపీతో కలుస్తుందా లేదా అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఈ సమయంలో ప్రధాని, అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం సమయంలో ఏపీ లోని రాజకీయ అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు స్కెచ్ సిద్దం చేసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది.
ఎవరు ఎవరితో:ఇప్పటి వరకు పలు సందర్భాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు ఇస్తున్న వైసీపీ అవసరం మరోసారి కేంద్రానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో గవర్నర్, ప్రభుత్వ అధికారాల పైన తాజాగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని పైన రాజ్యసభలో ఓటింగ్ అవసరమైతే వైసీపీ మద్దతు కోరే అవకాశం కనిపిస్తోంది. ఏపీకి సంబంధించి కొంత కాలంగా కేంద్రం నుంచి వస్తున్న సహకారం..భవిష్యత్ అవసరాల కోసం జగన్ మద్దతిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పునారావాస ప్యాకేజీ పైన ఈ సమావేశంలో కేంద్రాన్ని ఒప్పించేందుకు సీఎం ప్రయత్నిస్తారని సమాచారం. ప్రధానంగా ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎవరు ఎవరితో నిలుస్తారనే అంశం పైన ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశంకనిపిస్తోంది.












Click it and Unblock the Notifications