మీరూ ఇలాంటివి రాస్తారా.. బాధేస్తోంది, 'సాక్షి'పై పరువు నష్టం: సీఎం రమేష్
ఢిల్లీ: తన కంపెనీల పైన అవాస్తవ కథనాలు రాసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా 'సాక్షి' పైన తాను పరువు నష్టం దావా వేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ సీఎం రమేష్ బుధవారం నాడు మండిపడ్డారు.
తన కంపెనీల గురించి జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో అసత్య కథనాలు వచ్చాయన్నారు. వీటిపై తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు. అదే సమయంలో జర్నలిస్ట్ రామచంద్రమూర్తి పైన అసహనం వ్యక్తం చేశారు. మీరు కేవలం డబ్బుల కోసమే ఆ పత్రికలో చేరడం తనలాంటి వారికి బాధగా ఉందన్నారు.
మీరు కూడా ఇలాంటి వార్తలు రాస్తారనుకోలేదని చెప్పారు. మీరు ఇలాంటివి చేస్తారంటే బాధగా ఉందని చెప్పారు. మీలాంటి వాళ్లు కూడా ఇలా తయారయ్యారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షం ఖాళీ కావడం ఖాయమన్నారు. జగన్ కుటుంబం మాత్రమే మిగులుతుందన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేతగా జగన్ రాష్ట్రానికి చేసిందేమోటో చెప్పాలన్నారు.

మే 1 నుంచి విత్తన పంపిణీ: పత్తిపాటి
రాష్ట్రంలో రైతులకు ఈ ఏడాది మే 1 నుంచి విత్తన పంపిణీ ప్రారంభించనున్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. అలాగే ఈ ఏడాది రైతులకు రూ.74వేల కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించారు.
జూన్ 5 నుంచే వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్న తరుణంలో వ్యవసాయ శాఖ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వర్షాలు వచ్చే నాటికల్లా విత్తన పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు.
అలాగే రైతులకు ఇచ్చేందుకు 7.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి రాష్ట్రంలోని రైతులందరికీ భూసార పరీక్ష పత్రాలు అందజేస్తామన్నారు. ఏ రకం పంటలు వేయాలనే విషయంలో రైతులకు అవగాహన ఏర్పడుతుందన్నారు.












Click it and Unblock the Notifications