ముంబైకి సీఎం రేవంత్ - ఫడ్నవీస్ తో కీలక చర్చలు..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబాయి వెళ్తున్న రేవంత్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది. అదే విధంగా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశంపై సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో... ఈ భేటీ కీలకంగా మారుతోంది.
సీఎం రేవంత్ ముంబై వెళ్తున్నారు. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కీలక సమావేశం కానున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య నీట ప్రాజెక్టులు, పంపకాలకు సంబంధించి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంతో రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు పెంచడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచితే మహారాష్ట్రలో ముంపు ఏర్పడుతుంది. దీంతో అక్కడ ముంపునకు గురయ్యే భూములు, అక్కడి గిరిజన ప్రాంతాల ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.

ముఖ్యమంత్రి కీలక చర్చలతో
అందులో భాగంగా మహారాష్ట్రలో జరిగే భూసేకరణ భారాన్ని, ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పూర్తిగా తామే భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రాణహిత నదిపై 152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బ్యారేజీ ఎత్తు పెంపుదల వల్ల ఇరు రాష్ట్రాల్లోని గ్రామాలు ముంపు నకు గురవుతాయనే అపోహలను, ఆందోళనలపైన తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. తమ లెక్కలతో పాటుగా సాంకేతిక నివేదికలను మహారాష్ట్ర సీఎం ముందుంచి, వారికున్న అనుమానాలను నివృత్తి చేసి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ సాధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ జరిపే చర్చలు ఏ మేర ఫలిస్తాయనేది ఇప్పుడు రాజకీయం గానూ కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications
