కొత్త ఫించన్ల పంపిణీ పై కీలక అప్డేట్ - వీరందరికీ అమలు..!!
పెన్షన్ కోసం వేచి చూస్తున్న వారికి బిగ్ అప్డేట్. కొత్త ఫించన్ల పంపిణీ పైన ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా కసరత్తు చేస్తోంది. దసరా నుంచే ఈ పెన్షన్లు అందుతాయని భావించినా...ప్రారంభించలేదు. కాగా.. ఇప్పటికే అర్హులైన లబ్దిదారులను గుర్తించారు. ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా చేయూత పెన్షన్లు కొత్తవి పంపిణీ చేసే అంశం పైనా ప్రతిపాదనలు వచ్చాయి. కాగా.. ఇప్పుడు అర్హులైన వారికి ఈ కొత్త ఫించన్ల పంపిణీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త ఫించన్ల పంపిణీ కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. దసరా నుంచి కొత్త పింఛన్లు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆశలు పెట్టుకున్న అర్హులైన లబ్ధిదారులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు కొత్తగా 4.6 లక్షల మందిని అర్హత కలిగిన వారుగా గుర్తించారు. సీఎం రేవంత్ ములుగు జిల్లా పర్యటన వేళ కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లను అట్టహాసంగా ప్రారంభించారు. పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా అర్హులైన వారందరికీ దసరా పండుగనాడు పింఛన్లు పంపిణీ చేస్తామని వనదేవతల సాక్షిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి హామీతో రాష్ట్రవ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం 5.95 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నట్లు లెక్కలు తేల్చారు.

పంపిణీపై తాజా కసరత్తు
కాగా.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో వితంతువులు 2.5 లక్షల మంది, దివ్యాంగులు లక్ష మందికిపైగా, ఒంటరి మహిళలు 50 వేలు, గీత కార్మికులు 30 వేలు, నేతన్నలు (చేనేత) 7 వేల మందిని అర్హులుగా తేల్చారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 44 లక్షల మందికి చేయూత పింఛన్లు అందుతున్నాయి. వీరిలో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులు ఉండగా, వారికి ప్రతినెలా రూ.4,016 అందజేస్తున్నారు. మిగిలిన వారికి నెలకు రూ.2,016 ఇస్తుండగా, వీరందరి కోసం ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అయితే, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు కొత్త పింఛన్లు అందాల్సి ఉంది. దీంతో.. ప్రభుత్వం హామీ అమలు దిశగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 7వ తేదీకి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న వేళ.. ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
