పోలింగ్ తరువాత జగన్ ఏం చేయబోతున్నారు?
YS Jagan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఇంకో నాలుగు రోజులే మిగలివున్నాయి. వచ్చే సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.
శనివారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.

వైఎస్ జగన్ ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉంటోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు. ఒకే రోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ రోడ్ షోలను నిర్వహిస్తూ వస్తోన్నారు.
మంగళవారం నాడు తూర్పు గోదావరి రాజానగరం, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించారాయన. పాత గాజువాక సెంటర్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. నేడు విరామం తీసుకున్నారు. రేపు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తారు.
పోలింగ్ ముగిసిన తరువాత వైఎస్ జగన్.. లండన్‌కు వెళ్లనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి ఈ నెల 15వ తేదీన లండన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. 30వ తేదీ వరకు అక్కడే ఉంటారు. జూన్ 1వ తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచిన అనంతరం అదే రోజున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్, భారతి దంపతుల కుమార్తెలు వర్షా రెడ్డి, హర్షారెడ్డి లండన్‌లో చదువుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విద్యార్థులు. 2019లో పోలింగ్ తరువాత వైఎస్ జగన్ దంపతులు లండన్ వెళ్లారు.












Click it and Unblock the Notifications