ఆ విషయంలో మోదీకే నా సపోర్ట్: తేల్చేసిన జగన్: డర్టీ గేమ్
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోన్నారు. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య టైమ్స్ నౌ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు వైఎస్ జగన్. పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు, తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. 16 నెలల జైలు జీవితాన్నీ గుర్తు చేసుకున్నారు. వైఎస్ షర్మిల అంశాన్నీ ఆయన ప్రస్తావించారు.
కేంద్రంలో ప్రస్తుతానికి తాము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వట్లేదని జగన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయినా రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే అంశాలపైనే తమ మద్దతు ఉంటుందని, వ్యక్తిగతంగా ఎవ్వరికీ అండగా ఉండట్లేదని పేర్కొన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అని, జాతీయ స్థాయిలో ఎవరికీ సపోర్ట్ చేయట్లేదని అన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు కోసం ప్రయత్నాలు చేయలేదని చెప్పారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో తాను ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నానని జగన్ తేల్చి చెప్పారు. అదే సమయంలో మైనారిటీల విషయంలో ఆయన అనుసరిస్తోన్న విధానాలతో విభేదిస్తోన్నానని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన మాట వాస్తవమే అయినప్పటికీ- ఆ పార్టీ నాయకులే తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపారని గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని తాను అనుకోవట్లేదని జగన్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలనేది ప్రజల చేతిలో ఉందని, తమకు నచ్చిన నాయకులనే వాళ్లు ఎన్నుకుంటారని అన్నారు.
ఆస్తుల కేసులో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి తనపై అక్రమ కేసులను బనాయించారని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కన్నుమూసిన తన తండ్రి పేరును సైతం ఛార్జిషీట్‌లో పెట్టారని విమర్శించారు. ఎలాంటి కారణాలు లేకుండా 16 నెలల పాటు తాను జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం.. దాన్ని చట్టంగా మార్చడంలో విఫలమైందని జగన్ విమర్శించారు. హోదా అనే హామీ చట్టంగా రూపుదాల్చకపోవడం వల్ల బీజేపీ నాయకత్వం వహిస్తోన్న ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదని అన్నారు.
వైఎస్ షర్మిల ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆడే డర్టీ గేమ్స్‌లో ఆమె పావుగా మారారరని వ్యాఖ్యానించారు. తన సొంత కుటుంబం, తోబుట్టువుల మధ్య తిరుగుబాటు చెలరేగేలా చంద్రబాబు ఆమెను ప్రభావితం చేశారని ఆరోపించారు.
వైఎస్ఆర్సీపీలో వైఎస్ షర్మిలకు రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై జగన్ స్పందించారు. పార్టీ అనేది కుటుంబం నడిపేది కాదని అన్నారు. పార్టీకి వారసత్వ సమస్య అనేది రాబోదని తేల్చి చెప్పారాయన. తన వయస్సు చిన్నదేనని, సుదీర్ఘకాలం పాటు పార్టీని నడిపే అవకాశం ఉన్నందున తన తరువాత వైఎస్ఆర్సీపీ వారసుడు ఎవరనే ప్రశ్న ఇప్పట్లో తలెత్తదని అన్నారు.












Click it and Unblock the Notifications