ఈ రాత్రి కాళరాత్రే..! మరో కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై భీకర దాడులు..
పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారింది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న వివాదం ఇప్పుడు ఏ క్షణమైనా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా అంత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక సంధి ఒప్పందం (memorandum of understanding) పూర్తిగా ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధి నౌకా మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా.. అమెరికా వైమానిక దళం ఇరాన్‌లోని ఎనభైకి పైగా సైనిక స్థావరాలపై ఇప్పటికే భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల వేడి చల్లారకముందే, ఇరాన్‌పై ఈ రాత్రికి మరోసారి భీకర దాడులు (very probably hit again) తప్పవంటూ ట్రంప్ ఇచ్చిన బిగ్ వార్నింగ్ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
టర్కీలో జరుగుతున్న నాటో (NATO) శిఖరాగ్ర సదస్సు నుంచి ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు రేపు జరగనున్న నేపధ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంత్యక్రియల్లో పాల్గొంటున్న లక్షలాది మందిని ఒక్క దెబ్బతో ముగించేయొచ్చనే రేంజ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ నాయకత్వం అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తోందని, వారితో ఇక దౌత్యపరమైన చర్చలు జరపడం వృథా అని ట్రంప్ మండిపడ్డారు. ఈ క్రమంలో అమెరికా తీసుకున్న సైనిక చర్యను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా సమర్థించాయి.

కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ ఎదురుదాడి
అమెరికా దాడుల అనంతరం ఇరాన్ సైన్యం కూడా తన ప్రతిఘటనను ముమ్మరం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న కువైట్, బహ్రెయిన్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను, పదమూడు డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ సైన్యం ప్రకటించింది. బహ్రెయిన్ సైన్యం కూడా ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది.
స్తంభించిన నౌకాయానం.. చమురు మార్కెట్ విలవిల
ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ మార్గంలో నౌకాయానం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆరు శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు డెబ్భై ఎనిమిది డాలర్లకు చేరడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రోజూ వందలాది ఇంధన రవాణా నౌకలు ప్రయాణిస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల దాదాపు వేలాది మంది అంతర్జాతీయ నావికులతో కూడిన నౌకలు సురక్షిత ప్రాంతాల్లో నిలిచిపోయాయి.
అమెరికాకు నరకం చూపిస్తాం: ఇరాన్ హెచ్చరిక
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ సైనిక నాయకత్వం కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చింది. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ తీరాలపై బలగాల మోహరింపునకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హబీబుల్లా సయ్యారీ హెచ్చరించారు. అమెరికా సైన్యానికి తమ దేశ తీరాలు నరకప్రాయంగా మారతాయని వ్యాఖ్యానించారు. హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న సరికొత్త భద్రత గల వ్యవస్థను అమెరికా గుర్తించక తప్పదని ఇరాన్ పార్లమెంట్ కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజీ స్పష్టం చేశారు.
ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించడానికి, జలసంధిలో సురక్షిత నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు రంగంలోకి దిగారు. యూరోపియన్ యూనియన్ - అరబ్ గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులు వచ్చే సోమవారం అత్యవసరంగా సమావేశం కానున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రతరమైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications