జగన్ 151 ప్లస్ ధీమా వెనుక, ఆ రిపోర్ట్స్ కీలకం - అక్కడే బిగ్ ట్విస్ట్...!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేసారు. అసలు హోరా హోరీగా సాగిన ఎన్నికల సమరంలో ఇది సాధ్యమేనా అనే చర్చ రాజకీయంగా మొదలైంది. అయితే..జగన్ ఈ ప్రకటనకు ముందు చేసిన కసరత్తు...సేకరించిన సమాచారం..నివేదికల సారాంశం ఆసక్తి కరంగా కనిపిస్తోంది. కానీ, ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. దీంతో..అసలు ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.
జగన్ అంచనాలతో
ఏపీలో ఈ నెల 13న పోలింగ్ జరిగింది. ఆ తరువాత మూడు రోజులకు జగన్ ఐ ప్యాక్ టీంతో సమావేశమయ్యారు. తొలి సారి ఎన్నికల తీరు పైన స్పందించారు. ఊహించని ప్రకటన చేసారు. 2019లో సాధించిన151 అసెంబ్లీ,22 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసారు. తమకు వచ్చే సీట్లను ప్రశాంత్ కిశోర సైతం ఊహించలేరని చెప్పుకొచ్చారు. మరో అయిదేళ్లు ఇంత కంటే మంచి పాలన అందిస్తామని జగన్ చెప్పారు. ఇక..జగన్ చెప్పిన లెక్కల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ, టీడీపీ నుంచి సహజసిద్దమైన కౌంటర్ కనిపించలేదు. టీడీపీ నేతలు కొందరు తమదే గెలుపు అని చెబుతున్నా..జగన్ చెప్పిన లెక్క ఏంటనేదే ఇప్పుడు చర్చగా మారింది.

జగన్ భారీ కసరత్తు
అయితే, వైసీపీ ముఖ్య నేతలు మాత్రం జగన్ ఈ ప్రకటన ఆషామాషీగా చేయలేదని చెబుతున్నారు. పోలింగ్ కు ముందే ఎగ్జిట్ పోల్, ఓటింగ్ సరళి, ఓటర్ల పల్స్ తెలుసుకొనేందుకు సీఎం జగన్ పూర్తిగా నేతలను సిద్దం చేసారు. వైసీపీకి రాజకీయంగా సహకారం అందిస్తున్న ఐప్యాక్, సొంత మీడియా సంస్థ, నిఘా వ్యవస్థతో పాటుగా మరో మూడు సర్వే సంస్థలను రంగంలోకి దించారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిబ్బందిని మొహరించారు. ప్రతీ కేటగిరిలో ఓటరు నాడి తెలుసుకొనేందుకు ఈ సిబ్బంది ప్రయత్నించారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను వినియోగించారు. ఆ యాప్ ద్వారా ఓటరు తమ అభిప్రాయం వెల్లడించేలా సర్వే నిర్వహించారు. ఈ మొత్తం నివేదికలు మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాయి.
జగన్ ధీమా వెనుక
ఐప్యాక్ తో సహా అన్ని సంస్థల ముఖ్యులతో జగన్ సమావేశమయ్యారు. ప్రతీ పోలింగ్ బూత్ నుంచి నియోజకవర్గాల వారీగా వచ్చిన పోలింగ్ సరళిని అన్ని సంస్థల నివేదికలను పరిగణలకి తీసుకొని యావరేజ్ మద్దతు ఓటింగ్ శాతంతో లెక్కలు వేసారు. మహిళల్లో పెద్ద ఎత్తున మద్దతు..ఆశించిన వర్గాల నుంచి సపోర్ట్ దక్కిందనే నిర్ధారణకు వచ్చారు. కూటమి నుంచి గెలిచే స్థానాల పైన ఒక అంచనా కనిపించింది. ఆ తరువాతనే జగన్ ప్రకటన చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే...పోలింగ్ ప్రక్రియ...కూటమి ఇచ్చిన పోటీ చూసిన వైసీపీ నేతలు జగన్ చెప్పినట్లుగా 151 పైగా గెలవటం సాధ్యమా అనే సంశయంలో కనిపిస్తున్నారు.అయితే, జగన్ ప్రచారం లేదా హైప్ కోసం ఇలాంటి ప్రకటనలు చేయరనేది మరో వాదన. దీంతో..తుది ఫలితాల పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications