ప్రతి 6 నెలలకూ రిపోర్ట్: కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన జగన్
అమరావతి: రాష్ట్రంలో మరిన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. కడప, తిరుపతి, విశాఖపట్నం, నంద్యాల.. సహా పలు జిల్లాల్లో ఆయా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఇది అమల్లో ఉందని, సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు.

స్థానికులు 75 శాతం రిజర్వేషన్ అనేది సరిగ్గా అమలవుతుందా? లేదా? అనే విషయంపై సమీక్ష చేయాలని, క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలని జగన్ పేర్కొన్నారు. ప్రైవేటు సహా అన్నిరకాల పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని పునరుద్ఘాటించారు.
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలంటూ ఇదివరకే చట్టం సైతం చేశామని జగన్ గుర్తు చేశారు. ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని ఆయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ చట్టం అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో పరిశ్రమలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నామని జగన్ వివరించారు.
పారిశ్రామికవేత్తలకు భూములు, ఇతర వనరులు సమకూరుస్తున్నామని జగన్ గుర్తు చేశారు. స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఉద్దేశంతోనే స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోన్నామని పేర్కొన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు, అది సమర్థవంతంగా నడవడానికి ఆ ప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరమని జగన్ తేల్చి చెప్పారు.
స్థానిక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్య పడుతుందని, అందువల్లే తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటై ఉన్న, నిర్మాణంలో ఉన్న, రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని తేల్చి చెప్పారు. కంపెనీలు ఏవైనా సరే.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications