ఆనం, కోటంరెడ్డి విషయంలో ఏం జరిగిందో చూశారుగా- ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన సమీక్షించారు. ఇందులో అలసత్వాన్ని ప్రదర్శించిన కొందరు ఎమ్మెల్యేలను సున్నితంగా మందలించారు.
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీపరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు.ఇందులో భాగంగా తరచూ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోన్నారు.

గడప గడపకు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్‌బ్యాక్‌ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది. భవిష్యత్‌లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.

మరో దఫా కీలక భేటీ..
ఈ క్రమంలో వైఎస్ జగన్ ఇవ్వాళ మరోసారి పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు.. ఇందులో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటోన్నారు?, సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు.

వారికి క్లాస్..
తక్కువ రోజులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన కొందరు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నారు. సున్నితంగా వారిని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేపడుతున్నఅభివృద్ధి ప్రాజెక్టులను ప్రజలకు చేరవేయడంలో ఏ మాత్రం నిర్లక్ష్యాన్ని వహించొద్దని సూచించారు. అలాంటి వాటిని తాను ఉపేక్షించబోనని అన్నారు. ఈ విషయంలో ఆయన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

మార్చి 18 నుంచి..
మార్చి 18 నుంచి 26వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్ ప్రచారాన్ని నిర్వహించాలని, దీన్ని విజయవంతం చేయాలని సూచించారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్తారని, వారికి సహకరించాలని అన్నారు. గత ప్రభుత్వానికి- తమ ప్రభుత్వానికి ఉన్న తేడాను స్పష్టంగా లబ్దిదారులకు వివరించాల్సిన అవసరం పార్టీకి చెందిన ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు.

14-15 నెలల్లో..
ఇంకో 14- 15 నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నామని, ఈ సమయంలో పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం నిర్ణయాలను ప్రజలకు చేరవేయాలని అన్నారు. ప్రజలను ఏమార్చడానికి టీడీపీ అనుకూల మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని, వాటిని తిప్పికొట్టాలని జగన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచి తీరాలని, దీనికోసం జిల్లా పార్టీ అధ్యక్షుడి స్థాయి నుంచి కిందిస్థాయి వరకు అందరూ సమష్టిగా పని చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications