జగన్.. కుటుంబ సమేతంగా
YS Jagan: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపై నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామంటూ ఐప్యాక్ టీమ్ సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా. అటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ధీమా వ్యక్తమౌతోంది.

ఈ క్రమంలో వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సాగరనగరం విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.
మొన్నటి వరకు ప్రభుత్వ వ్యవహారాలు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన వైఎస్ జగన్.. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. భార్య వైఎస్ భారతితో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 30వ తేదీ వరకు యూరప్‌లో పర్యటిస్తారు. జూన్ 1వ తేదీన జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన.
విదేశీ పర్యటనకు బయలుదేరిన వైఎస్ జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు కొందరు మంత్రులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, మల్లాది విష్టు.. జగన్‌ను మర్యాదపూరకంగా కలిసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications