నా చెల్లికి డిపాజిట్లు కూడా దక్కనివ్వను - జగన్
YS Jagan: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఈ సంఖ్యను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉందా పార్టీ అగ్రనాయకత్వం. వైనాట్ 175/25 అనే నినాదంతో ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ధీటుగా స్పందిస్తోంది. ఆయా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య ఇండియా టుడే న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు వైఎస్ జగన్. పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలు, ఎన్నికల ఫలితాలు, తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు. వైఎస్ షర్మిల అంశాన్నీ ఆయన ప్రస్తావించారు.
ఏపీలో కాంగ్రెస్, బీజేపీ రిమోట్స్ చంద్రబాబు చేతిలో ఉన్నాయని.. ఈ రెండు పార్టీలను ఆయనే కంట్రోల్ చేస్తోన్నారని వైఎస్ జగన్ అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల.. చంద్రబాబును కలవటం, ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా ఆయనకు దగ్గరి బంధువు కావడాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.
ఏపీలో తనకు పోటీగా రాజకీయాలు చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వైఎస్ షర్మిలను ప్రభావితం చేశారని జగన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తాను బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌తో తాను పోరాడుతున్నానని జగన్ పేర్కొన్నారు.
కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న వైఎస్ షర్మిల గురించి జగన్ మాట్లాడారు. షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదు- ఆమెకు డిపాజిట్లు కూడా దక్కబోవనే విషయం తనను బాధకు గురి చేస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు జగన్.
తనపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు కన్నుమూసిన తరువాత కూడా ఛార్జిషీట్‌లో తండ్రి పేరును చేర్చిన పార్టీ తరఫున షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తోండటం బాధ కలిగించిందని జగన్ అన్నారు. ఎవరు ఏమిటనేది ఈ ఎన్నికల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కేసులు, రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు జైలులో ఉండటంపైనా జగన్ స్పందించారు. చంద్రబాబు తప్పు చేశాడా? లేదా? అనేది న్యాయస్థానాలు నిర్ధారిస్తాయని, ఆయనకు జైలుశిక్ష పడిందీ అంటే ఏదో తప్పు చేశాడనే అర్థమని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తప్పు చేశాడనడానికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
తాము మళ్లీ అధికారంలోకి వస్తేనే అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేయూత, ఆసరా, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు, వలంటీర్ల ద్వారా నెలవారీ సామాజిక పింఛన్లు డోర్ డెలివరీ వంటి కార్యక్రమాలు కొనసాగుతాయని జగన్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications