ఎల్లుండి హైదరాబాద్‌కు వైఎస్ జగన్: మోడీ వెళ్లొచ్చిన మరునాడే
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేపట్టిన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైంది. 14వ తేదీ వరకు జరగనున్నాయి. 13 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహంలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1,035 కుండాలతో శ్రీలక్ష్మీనారాయణ యాగాన్ని నిర్వహిస్తోన్నారు.
సహస్రాబ్ది సమారోహం వేడుకలో రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన ఆయనను వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 216 అడుగుల శ్రీరామానుజులవారి విగ్రహాన్ని సందర్శించారు. ఆయన వెంట చినజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.

అంగరంగ వైభవంగా సాగుతోన్న రామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఎల్లుండి ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ చినజీయర్ స్వామివారి ఆశ్రమానికి బయలుదేరి వెళ్తారు. సహస్రాబ్ది వేడుకలకు హాజరవుతారు. అక్కడ వైభవంగా సాగుతోన్న శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొంటారు. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
Recommended Video
ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ ఉత్సవాలకు హాజరు కావాలంటూ త్రిదండి చినజీయర్ స్వామి ఇదివరకే వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన వెళ్లిన మరుసటి రోజే వైఎస్ జగన్- రామానుజ సహస్రాబ్ది వేడుకలకు హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications