నేడు నిధులను విడుదల చేయనున్న వైఎస్ జగన్
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి- జగనన్న విదేశీ విద్యాదీవెన. విదేశాల్లో చదువుకుంటోన్న అర్హులైన విద్యార్థులకు అయ్యే ఫీజు మొత్తాన్నీ ఏపీ ప్రభుత్వమే భరించేలా రూపొందించిన పథకం ఇది.
ఈ పథకం కింద అర్హులైన విద్యార్థుల ఖాతాల్లోకి నేడు నిధులు జమ కానున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ఆన్‌లైన్ విధానంలో నిధులను విడుదల చేస్తారు. విదేశీ విద్యా దీవెన పథకం కింద చదువుకుంటోన్న 390 మంది విద్యార్థుల ఖాతాలకు 42.60 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం కింద ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన 95 మంది సివిల్ సర్వీస్ అభ్యర్థులకు, మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన 11 మంది అభ్యర్థులకు నగదు ప్రోత్సాహకాలను కూడా జగన్ విడుదల చేయనున్నారు.
పేద విద్యార్థులు నాణ్యమైన విదేశీ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు 1.25 కోట్ల రూపాయలు, ఇతర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు కోటి రూపాయల వరకు మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తోంది. ఇందులో విమాన ఛార్జీలు, వీసా ఛార్జీలు ఉంటాయి.
21 ఫ్యాకల్టీల్లో ఒకదాంట్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్నివర్తింపజేసింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్ 50 యూనివర్సిటీలలో ఇంజినీరింగ్, మెడిసిన్, లా, మొదలైన కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు దీనికి అర్హులు. ఈ పథకం కింద ఏపీ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా 320కి పైగా ఉన్నత కళాశాలల్లో ఉచితంగా చదువుకోవచ్చు.












Click it and Unblock the Notifications