పవన్ నిర్ణయంతో మారిన సీన్, లైన్ క్లియర్ - బీజేపీ నెక్స్ట్ స్టెప్..!!
ఏపీలో పొత్తుల లెక్కలపై క్లారిటీ వస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు పైన పవన్ స్పష్టత ఇచ్చారు. బీజేపీ కలిసి వస్తుందనే నమ్మకం పవన్ మాటల్లో కనిపించటం లేదు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుకు వామపక్ష పార్టీలు ప్రతిపాదించాయి. అటు బీజేపీ నేతలు పవన్ తీరును నిశితంగా గమనిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ టీడీపీతో పొత్తు ప్రకటనపై పూర్తి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో బీజేపీ స్టాండ్ ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
పవన్ క్లారిటీ
ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తాయని..ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ తేల్చి చెప్పారు. బీజేపీ ప్రస్తావన లేదు. బీజేపీతో వెళ్లటం వలన ఓట్లు వచ్చినా..సీట్ల సంగతి ఏంటని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఏపీలో బలం పెంచుకొనేందుకే పవన్ తో బీజేపీ జత కట్టింది. ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించింది. కొంత కాలంగా టీడీపీతో పవన్ దగ్గర అవుతున్నా..బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని పదే పదే చెబుతూ వచ్చారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటన తరువాత తాను బీజేపీ నేతలను కలిసి జరిగిన పరిణామాలను వివరిస్తానని పవన్ చెప్పారు. ఇప్పుడు తాజాగా వారాహి యాత్రలో పవన్ తమ రెండు పార్టీలే అధికారం ఏర్పాటు చేస్తామని చేసిన వ్యాఖ్యలతో జనసేనాని ఆలోచనపైన దాదాపు క్లారిటీ వచ్చింది.

టీడీపీతోనే పొత్తు
టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ తొలిగించి మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా పవన్ ప్రయత్నాలు చేసారు. బీజేపీ నుంచి సానుకూలత రాలేదు. మధ్యలో చంద్రబాబు స్వయంగా అమిత్ షా తో భేటీ అయ్యారు. కానీ పొత్తుల ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. చంద్రబాబు అరెస్ట్ తో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. చంద్రబాబును జైలులో కలిసిన పవన్ బయటకు రాగానే పొత్తు ప్రకటించారు. ఇప్పుడు తమ రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. బీజేపీతో సంబంధం లేకుంటే తాము టీడీపీతో కలుస్తామని వామపక్ష పార్టీలు ముందుకు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ టీడీపీ వామపక్ష పార్టీల మద్దతు తీసుకుంది. ఫలితంగా రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది.
బీజేపీ నిర్ణయం ఏంటి
ఇక, తాజా పరిణామాల పై ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ నాయకత్వానికి పూర్తి సమాచారం అందించారు. పవన్ బీజేపీతో కొనసాగుతారా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు. బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతూనే ఏకపక్షంగా టీడీపీతో పొత్తు నిర్ణయం పైన బీజేపీలో చర్చ సాగుతోంది. బీజేపీ కంటే టీడీపీ ముఖ్యమనే విధంగా పవన్ తీరు ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏపీ బీజేపీలోనూ చంద్రబాబుతో పాత్తుకు అనుకూలంగా కొందరు..వ్యతిరేకంగా మరి కొందరు ఉన్నారు. ఈ సమయంలో కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబి ఉంటామని చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాల పైన ఏం చేయబోతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ తో చర్చించి..పొత్తులకు అంగీకారం చెబుతుందా..లేకుంటే ఒంటరి పోరాటానికే సిద్దపడుతుందా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications