సాక్షిపై ఫిర్యాదు, జగన్ భార్య భారతిపై కేసు: టిడిపి ఎంపీ అలిగారా?
గుంటూరు: సాక్షి మీడియాలో అసత్య ఆరోపణలు ప్రచారం చేశారంటూ గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆదివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసిపి అధినేత జగన్, సాక్షి పత్రిక, ఛానల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పొన్నూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 12మందిపై కేసు నమోదు చేశారు.
రాజధానిలో అవినీతి అంటూ తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల.. పొన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వైయస్ జగన్ పైన కేసు నమోదు చేశారు.
పొలిటికల్ మెంటార్ ఆఫ్ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ హోదాలో జగన్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు, జగతి పబ్లికేషన్స్ చైర్ పర్సన్ హోదాలో ఉన్న జగన్ సతీమణి వైయస్ భారతిపైనా కేసు నమోదు చేశారు.
సాక్షి పత్రిక పబ్లిషర్ హోదాలో ఉన్న సీనియర్ జర్నలిస్టు కె రామచంద్రమూర్తి, ఎడిటర్ వి మురళి, జగతి పబ్లికేషన్ డైరెక్టర్లు హన్నప్పనహల్లి వీరన్న ఈశ్వరయ్య, వై ఈశ్వరప్రసాద్ రెడ్డి, వి శ్రీధర్ రెడ్డి, రాజప్రసాద రెడ్డి, పివికె ప్రసాద్, ప్రకాశ రావు అంతుర్ నారాయణ్, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ డైరెక్టర్లు ఎల్ బలరాం రెడ్డి, వీర్మణి బాలరాజు, బండి రాణిరెడ్డి తదితరులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యే రాకపై ఎంపీ అసంతృప్తి!
శ్రీకాకుళం జిల్లాలో.. వైసిపి ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి. పాతపట్నంలో తనకంటూ ఓ వర్గం ఉన్నందున.. ఇప్పుడు కలమట రావడం రామ్మోహన్ నాయుడు కొంత అసంతృప్తితో ఉన్నారట.
దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం: సుజాత

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన విద్యార్థిని ఇందుమతి సజీవదహనం పట్ల రాష్ట్ర మంత్రి పీతల సుజాత, మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఇందుమతి మృతదేహాన్ని ఆదివారం సందర్శించారు.
మృతురాలి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. నిర్భయ చట్టం కింద దోషులను శిక్షిస్తామని మంత్రి పీతల సుజాత తెలిపారు. ఇదిలా ఉండగా ఆసుపత్రి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు, బీసీ సంఘం నాయకులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.












Click it and Unblock the Notifications