పూర్తి పాఠం: చెరుకు సుధాకర్ రాజీనామా లేఖ

హైదరాబాద్: నల్లగొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి రాజీనామా చేశారు. ఆయన పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉంటూ వచ్చారు. అయితే, కనీసం పొలిట్‌బ్యూరో సమావేశాలకు ఆయనకు పిలుపు రాలేదని సమాచారం. పలు విధాలుగా తెరాసలో ఆయన అవమానాలు మోసినట్లు తెలుస్తోంది. ఆ అవమానం భరించలేక ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఆయన రాజీనామా లేఖ పూర్తి పాఠం కింది ఇస్తున్నాం. చదవండి...

గౌరవనీయులైన కె. చంద్రశేఖర్‌ రావు గారు
అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సమితి గారికి

Complete text: Cheruku Sudhakar's resignation letter

నల్లగొండ జిల్లాలో కోదాడ నుండి ప్రారంభమయిన మీ పాదయాత్ర 2003, ఆగస్టు, 30న హాలియా చేరిన సందర్భంగా, నేను వేలాది మంది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో మీ సమక్షంలో టి.ఆర్‌.ఎస్‌లో చేరినాను. యాదృచ్చికంగా అదేరోజు నా పుట్టిన రోజు కావడంతో తెరాసలో నా చేరిక ప్రతి సంవత్సరం ఆగస్టు 30న ఒక ఉద్ద్వేగాన్ని, కర్తవ్యాన్ని గుర్తుచేసేది. 1997, ఆగస్టు, 11న నేను వ్యవస్థాపక కన్వీనర్‌గా మీరు చంద్రబాబు ప్రభుత్వంలో కొనసాగుతున్న తరుణంలోనే తెలంగాణ మహాసభ ఏర్పడి అనేక కష్టనష్టాలకు వోర్చి వేలాది మందిని కదిలించినా, తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఆచార్య జయశంకర్‌, బియ్యాల జనార్దన్‌ రావు, వి. ప్రకాష్‌, భరత్‌, నిరంజన్‌ రెడ్డి ప్రోద్భలంతో జగదీస్‌రెడ్డి ఆహ్వానంతోనే టి.ఆర్‌.ఎస్‌లోకి వచ్చాను.

2003లో పెనవేసుకున్న కె.సి.ఆర్‌. తెరాస బందం నన్ను, నా వ్యక్తిత్వాన్ని, అవగాహనను అనేక రకాలుగా ప్రభావితం చేసింది. మీరు అభిమానించి నన్ను ప్రిసీడియం సభ్యుల్ని, తరువాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, పోలిట్‌బ్యూరో సభ్యున్ని చేసింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌, టి.ఆర్‌.యస్‌ పొత్తు ఉన్నప్పటికి. సి.పి.యం., సి.పి.ఐపై ఇచ్చిన అపసవ్య, డూప్లికేట్‌ భి.ఫామ్‌తో తెరాస అభ్యర్థిగా కారు గుర్తుతో నకిరేకల్‌ నియోజక వర్గం నుండి పోటిచేసి ఓడిపోయింది వాస్తవం. నేను మాత్రమే కాదు. అట్లా ఇచ్చిన బి.ఫామ్‌ అభ్యర్దులెవరికి డిపాజిట్లు రాలేదు. డిపాజిట్‌ రాలేదని ఉద్యమానికి పనికి రావని మీరు నన్ను వెనక్కు పంపి కొత్తవాన్ని చూడలేదు. పైగా చెరుకు సుధాకర్‌ మాకు వరం అన్నారు. మనం 26 మందిని గెలిపించుకొని, అనేక అపసవ్యపనులతో కాంగ్రెస్‌ మంత్రివర్గంలో భాగస్వామ్యములో అనేక ప్రలోభాలు, లోపాలతో ఎంత కుంచించుకుపోయామో మీకు తెలుసు.

ఉపఎన్నికల ప్రయోగం ద్వారా ఎన్ని విమర్శలు ఎదురుకొన్నా, తెలంగాణ ప్రజాక్షేత్రం ఎప్పుడు ఉద్యమ భావజాలంతో సజీవంగా ఉండడానికి మీరు చేసిన కృషిలో నా భాగస్వాయ్యం, శ్రమ ఉందో లేదో మీరే చెప్పాలి.

ఉపన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు, ఒక దశలో ఈ పార్టీ బాద్యతల్ని ఎవరు స్వీకరించినా ఏమీ లేదని దేవేందర్‌గౌడ్‌కు కబురు పెట్టినప్పుడు ఎవరు ఉన్నా లేకున్నా మేము అండగా ఉంటామనే కదే మునుగోడులో డిపాజిట్‌రాని కర్నె ప్రభాకర్‌, నకిరెకల్‌లో డిపాజిట్‌ రాని చెరుకు సుధాకర్‌ అండగా ఉన్నది?

ఎవరి అక్కెరకు వారు ఎన్నో తప్పుడు సలహాలు ఇచ్చిన ముక్కుసూటిగా మాట్లాడే చెరుకు సుధాకర్‌ అంటే నాకు ఎంతో అభిమానమని, ఈ బందం ఎప్పటికి విడిపోవద్దని మీ మెడలోని బరువైన బంగారు గొలుసు నా మెడలో వేసింది మీరే కదా!

అమెరికాలో ఉన్న కేటియార్‌, వివాహం తరువాత కవిత ఉద్యమంలోకి వస్తే, హరీష్‌, సంతోష్‌తో కలిపి నేను మీ కుటుంబ సభ్యుడినని దగ్గరకు చేర్చి, ఇప్పుడు నేనేదో బయటివ్యక్తి అయినట్టు ఎందుకు అవమానిస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలియాలి.

2006లో ఉపన్నికల ప్రతికూల ఫలితాల తరువాత నియోజక వర్గాల పునర్‌ వ్యవస్ధీకరణలో అనివార్యంగా ఎవరూ ముందుకు రాని పరిస్థితులో నా భార్య యస్సీ కనుక కాలం నిర్ణయించినప్పుడు పోటీలో ఉందామని ఎదురుచూస్తే 2009 మహాకూటమి ఎన్నికల్లో ఉద్యమం బలంగా ఉన్న నియోజకవర్గాలకు వదిలి హుజూర్‌నగర్‌ లాంటి ప్రాంతంలో అవకాశం తీసుకున్నారు. అయినా ప్రతికూల ఫలితాలు తరువాత లోటస్‌పాండ్‌ సమావేశంలో మీ ప్రతి నిర్ణయానికి అండగా నిలబడిన తరువాతే మీరు చారిత్రక అమరణనిరాహార దీక్షకు కూచున్నారు.

2009, నవంబర్‌ దీక్షలో మీరు అరెస్టయి ఖమ్మంకు తరలించబడినప్పుడు హాస్పిటల్‌లో ఎన్ని చీకటిరాత్రులో, ఎన్ని ఆత్మీయ సంభాషణలు, అన్ని ఇప్పుడు మరచి ఎన్నికల్లో డిపాజిట్‌ రాలేదని గుర్తు చేస్తే, నేను ఎవరితో ఈ అవమానాన్ని షేర్‌ చేసుకోవాలి? నిమ్స్‌కు తరలిస్తే, మీతోపాటు, జయశంకర్‌, విద్యాసాగర్‌రావు గారితో పాటు ఎన్ని విషయాలు చర్చించాము? మీరు పిలువమంటేనే ప్రజాయుద్దనౌక గద్దర్‌ను, మాదిగ హక్కులనేత మందకృష్ణ మాదిగను పిలిచింది. తెలంగాణ పాటల పెద్దక్క విమల భర్త అమర్‌ అరెస్టయినప్పుడు మీరు స్పందిస్తేనే కదా అందరిని కలుపుకుని వచ్చింది? నేను పీడియాక్ట్‌తో జైలులో ఉంటే వారందరు స్పందించి ఉద్యమాలు చేస్తే నేనేదో తప్పుచేసినట్లు మీకు తప్పుడు సమాచారం ఇచ్చి నాకు దూరం చేయాలని చూసింది నిజం కాదా! దేశవ్యాప్త ఆందోళన తెరాస, ఇతర సంఘాలు చేసినప్పుడు రానున్న కాలంలో డాక్టర్‌ సాబ్‌ భువనగిరి పార్లమెంట్‌కు సరి అయిన అభ్యర్ది దొరికినాడని అన్నది నిజం కాదా! జగదీష్‌ రెడ్డి ద్వారా దక్షిణ తెలంగాణ గౌరవించే మేధావి చెరుకు సుధాకర్‌ని మించి ఎవరు ఉన్నారని రాజ్యసభకు సిద్దం కావాలని అన్నది నిజం కాదా!.

తెరాస బలోపేతం కావాలని కాంగ్రెస్‌లోకి వెళ్తానని సిద్దమయిన వేముల వీరేషంను తెరాసలోకి ఆహ్వానించి మీ ద్వారా గులాబి కండువా వేయించి, ఆరు మండలాల్లో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నాకు అండగా ఉండమని బాద్యతలు అప్పజెప్పితే, నాకు కౌంటర్‌గా వ్యూహం రచించి, మండల పార్టీలను విచ్చిన్నం చేసి, పల్లెబాట ప్రచారంలో నేను ఉండగానే అతనినే నియోజక ఇంచార్జి ప్రకటించడంలో జగదీష్‌ పాత్రెంతో అందరికి తెలుసు. ఈ కుట్రలకు, ద్వేషాన్ని రెచ్చకొట్టడానికి పరాకాష్ట నిన్న మీరు నకిరేకల్‌ నియోజకవర్గంలో వీరేషంను గెలిపిస్తే కేసియార్‌ను గెలిపించినట్లే అన్న ప్రకటన అంటే రేపు తెలంగాణ ఉద్యమ చరిత్రలో తీవ్ర నిర్భందాన్ని ఎదురుకొన్న చెరుకు సుధాకర్‌ను మీ అందరి సహకారంతో జైలు నుండి విడిపించుకున్న చెరుకు లక్ష్మి పోటీచేసి ఓడిపోతే మీరు గెలిచినట్లేనా? లేదా చెరుకు లక్ష్మి గెలిస్తే మీరు ఓడిపోయినట్లా? తెలంగాణ సమాజానికి తెరాస ఇప్పుడు ఇంటర్వెల్‌ అయిపోయింది, క్లెమాక్స్‌లో ఫక్తు రాజకీయ పార్టీ అంటే ఏమి ట్విస్ట్‌ ఇస్తారో రానున్న కాలమే చెబుతుంది. గులాబీ కండువాతో భువనగిరి పార్లమెంట్‌కు పోటీ చెద్దామనుకుంటే, నాకు చెక్‌ పెట్టడంకోసమే ఉద్యమక్షేత్రంతో సంబంధంలేని వ్యక్తిని, నా సామాజిక వర్గ వ్యక్తిని ఇంచార్జిగా ప్రకటించింది నిజం కాదా? నల్లగొండ జిల్లాలో ఏ పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయకుండా ఏకాకిని చేయాలని చూశారు. ఎన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చేదాక ఓపిక పట్టాలని కొనసాగినాను. నా బిడ్డ పెళ్ళికి, కొడుకు పెళ్ళికి ముందు పోలీసుల అరెస్టులు కుటుంబాన్ని ఎంత వేదనకు గురిచేసినా, ఉద్యమమే లక్ష్యంగా మీతోనే ఉన్నాను. జైలు గోడల మధ్య అనుభవించిన ఏకాంతం బాధ కంటే మీరు కొందరి చెప్పుడు మాటలతో ఏకాకిగా దూరం చేసినప్పుడు, అనుభవించిన బాధ భాషకు అందనిది. మీకు నన్ను దగ్గర చేయాలని కేటియార్‌, కవిత చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. 2014 ఎన్నికలు వచ్చే సరికి దళితుడిని తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసియార్‌, కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసియార్‌, పొత్తుకైనా పోతామన్న కేసియార్‌, టిఆర్‌యస్‌ను 14 ఏండ్లు కనుపాపలా కాపాడి ఉద్యమ పెద్దన్నను చేసిన ప్రతి నాయకుడు రేపటి చట్టసభలో ఉంటాడన్న కేసియార్‌ తెలంగాణ వ్యతిరేకులను, ద్రోహులను, ఉద్యమ జేఏసి నాయకులను కొట్టి తరిమిన వాళ్ళను, తుపాకులతో కాల్పులు జరిపిన వాళ్ళను, మహేందర్‌ రెడ్డి, కొండా సురేఖ దంపతులను పార్టీలో చేర్చి టికెట్లు ప్రకటించి ‘‘అపరిచితుడు'గా మారిన తరువాత, నిజంగానే ఇప్పుడు తెరాసలో తెలంగాణ సెంటిమెంట్‌ బలమెంతో అందరికి అర్థమవుతున్నది.

ఇప్పుడు 2014 ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు, రేపటి తెలంగాణకు పునాది రాళ్ళుగా ఉండాలి, మానుకోట మహిమగల రాళ్ళను, నకిరేకల్‌ ధర్మాగ్రహ రాళ్ళను ఊరూరు తీసుకుపోయేది వదిలిపెట్టి ఉద్యమంపై బండరాళ్ళు విసిరి వాళ్ళను, పంటికింద రాయిలను భుజాన ఎత్తుకుంటే తెరాసలో ఉండడం భారమనే బయటకు వస్తున్నాను.

అనివార్యమయినా, ఈ నిర్ణయం, తెలంగాణ ప్రజలకు నన్ను మరింత దగ్గర చేయాలనే కోరుకుంటున్నాను. భవిష్యత్తు కాలంలో పార్టీలకు అతీతంగా జరిగే తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కలిసి పనిచేస్తానని, ఇంతకాలం నన్ను అక్కున చేర్చుకున్న తెరాస నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను తెరాస నుండి దూరమే కాని తెలంగాణ ప్రజలనుండి వేరుకాదని తెలియజేస్తూ, తెరాస ప్రాథమిక సభ్యత్వానికి, పోలిట్‌బ్యూరోకు రాజీనామా చేస్తున్నాను.

డా॥ చెరుకు సుధాకర్‌
టి.ఆర్‌.యస్‌ పోలిట్‌బ్యూరో సభ్యులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+