చంద్రబాబుకు బీజేపీ పెద్దల ఆకస్మిక పిలుపు వెనుక కారణమిదేనట.. ?
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీతో బంధాన్ని తెంచుకుని ఆ పార్టీపై యుద్దాన్ని ప్రకటించిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల మాత్రం రూటు మార్చారు. అయితే చంద్రబాబు చేష్టలతో ఆగ్రహంగా ఉన్న బీజేపీ నేతలు ఆ పార్టీని మరోసారి దగ్గరకు రానిచ్చేందుకు ఇష్టపడలేదు. అలాగే ఏపీలో వైసీపీ ఘన విజయం, భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు, భారీ సంఖ్యలో ఉన్న ఎంపీలు బీజేపీని టీడీపీ దిశగా చూసేందుకు పురికొల్పలేదు. కానీ ఒక్క దెబ్బ మాత్రం బీజేపీ అభిప్రాయాన్ని మార్చేసింది.
మరో ఏడాది కాలంలో జరిగే ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో అవసరమైతేనే పొత్తు పెట్టుకోవాలని భావించి చంద్రబాబును దూరంపెట్టిన కాషాయ నేతలకు కర్నాటక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. అసలే దక్షిణాదిన ఏకైక రాష్ట్రం చేజారిపోవడంతో బేజారుగా ఉన్న బీజేపీ నేతలు.. ఈ ప్రాంతంలో మరో దెబ్బ తగలకుండా జాగ్రత్తపడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా కర్నాటకలో పోగొట్టుకున్న పరువును తెలంగాణలో గెలిచి తిరిగి దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు.

ఈ ఒక్క కారణమే చంద్రబాబును తిరిగి బీజేపీకి దగ్గర చేసింది. తాజాగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాల నుంచి దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత వచ్చిన పిలుపుతో చంద్రబాబు హస్తిన వెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చలతో జాతీయ మీడియా దృష్టి ఒక్కసారిగా ఇరుపార్టీలపై పడింది. అలాగే గత ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీల మధ్యసాగిన వైరం కూడా చర్చకు వస్తోంది. దీంతో ఈ ఇరుపార్టీల నేతల కలయిక వెనుక కారణాలపై జాతీయ మీడియా ఆరా తీస్తోంది.
బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుని మరీ భేటీ కావడం వెనుక కాంగ్రెస్ భయాలే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ అవకాశం ఇవ్వకపోతే మళ్లీ చంద్రబాబు కాంగ్రెస్ చెంతన చేరే అవకాశాలు లేకపోలేదు. ఈ సమీకరణం ఈసారి కచ్చితంగా తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కించుకోవాలన్న కలకు అడ్డంకిగా మారడం ఖాయమని అమిత్ షా భావిస్తున్నారు. దీంతో చంద్రబాబును పిలిపించి పొత్తుపై మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications