అవిశ్వాసం: ఢిల్లీ బుజ్జగింపు, తగ్గమని తేల్చేసిన ఎంపీలు
న్యూఢిల్లీ: యూపిఏపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సొంత పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు పార్టీ అధిష్టానం బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు రంగంలోకి దిగినట్లుగా సమాచారం.
అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఎంపీలతో డిగ్గీ భేటీ అయి బుజ్జగించారు. అహ్మద్ పటేల్ కూడా వారికి స్వయంగా ఫోన్ చేసి దానిని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే ఎంపీలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ముఖ్య నేతలకు ఎంపీలు తేల్చి చెప్పారని తెలుస్తోంది.

రాష్ట్రానికి దిగ్విజయ్
దిగ్విజయ్ సింగ్ ఈ నెల 12వ తేదిన రాష్ట్రానికి రావాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం, ఈ నెల 12వ తేదిన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం, విభజనపై సీమాంధ్ర నేతలు అసంతృప్తితో ఉండటం వంటి కారణాల వల్ల ఆన రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, ఈ సమయంలో రాష్ట్ర పర్యటనకు రావడం సరికాదని కొందరు ముఖ్యనేతలు ఆయనకు చెప్పారని తెలుస్తోంది. దీంతో ఆయన రాష్ట్రానికి చెందిన నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ రెండు రోజుల్లో ఆయన వస్తారా? లేదా? అనేది తేలనుంది.












Click it and Unblock the Notifications