వైసీపీలోకి వైఎస్సార్ టీం, రేపే - జగన్ 2.0 గేమ్ షురూ..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీలు ఇప్పుడు జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిన వైసీపీ తిరిగి కోలుకోకుండా కార్యాచరణ అమలుకు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. కూటమి లక్ష్యంగా కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పార్టీలో నాడు వైఎస్సార్ టీంలో కీలకంగా వ్యవహరించిన నేతలు వైసీపీలో చేరటం ద్వారా కేడర్ కు కొత్త సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ కొత్త రాజకీయం
జగన్ కాంగ్రెస్ వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన తరువాత, మద్దతుగా నిలిచేందుకు నిరాకరించిన నేతలు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి తరువాత ఇక పార్టీకి భవిష్యత్ లేదనే వాదన తెర మీదకు వచ్చింది. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీలోని పలువురు సీనియర్లు కూటమి పార్టీల్లో చేరారు. పార్టీ ముఖ్య నేతగా ఉన్న విజయ సాయిరెడ్డి తాజా నిర్ణయం తరువాత కేడర్ లోనూ కొంత అయోమయం మొదలైంది. ఈ సమయంలో జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నాడు వైఎస్సార్ తో కలిసి పని చేసిన నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. రేపు (శుక్రవారం) వారు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
వైసీపీలోకి కాంగ్రెస్ నేతలు
తాజాగా జగన్ 2.0 లో కార్యకర్తల కోసం ఎలా పని చేస్తానో చూస్తారంటూ మాజీ సీఎం చేసిన కామెం ట్స్ వైరల్ అయ్యాయి. జిల్లాల పర్యటనలకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో నాడు వైఎస్ విధేయుడిగా ఉన్న మాజీ పీసీసీ చీఫ్ శైలజా నాధ్ వైసీపీలో చేరుతున్నారు. కొద్ది రోజులుగా శైలజానాథ్ వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జగన్ తో బెంగళూరు కేంద్రం గా మంత్రాంగం సాగింది. ఇప్పుడు పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. అదే విధంగా తూర్పు గోదావరికి చెందిన మాజీ ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ పేరు రేసులో ఉంది. గతంలో వైఎస్ తో కలిసి పార్టీలో పని చేసిన మరో ముగ్గురు నేతలతో నూ చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారు జగన్ తో చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

షర్మిలకు షాక్
వైసీపీ నుంచి నేతలు వరుసగా కూటమి వైపు వెళ్తున్న వేళ.. ఈ చేరికలు పార్టీకి మేలు చేస్తాయనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. శైలజానాధ్ గతంలో మంత్రిగా, పీసీసీ చీఫ్ గా పని చేసారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పని చేసారు. షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్న సమయం లో జగన్ కాంగ్రెస్ నేతలు.. అందునా వైఎస్సార్ తో కలిసి పని చేసిన వారిని తన పార్టీలో చేర్చుకోవ టం ద్వారా షర్మిల కు సైతం షాక్ ఇచ్చే అంశంగా భావిస్తున్నారు. షర్మిల పార్టీ కోసం కాకుండా జగన్ పైన విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించటం కాంగ్రెస్ లో కొందరు ముఖ్యులకు నచ్చటం లేదు. ఈ అంశం పైన ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో, ముందుగా కాంగ్రెస్ నుంచే జగన్ 2.0 రాజకీయం మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications