ప్రత్యేక హోదాయే పార్టీల అస్త్రం: సెంటిమెంట్, కాంగ్రెస్ బలపడాలంటున్న టిడిపి
ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు కారణమైందని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో గత ఎన్నికల్లో ఆ పార్టీకి
అమరావతి: ప్రత్యేక హోదా అంశాన్ని అస్త్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు కారణమైందని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో గత ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన ఒక్క అభ్యర్థిని కూడ గెలిపించలేదు. కానీ, పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.ప్రత్యేక హోదా పేరుతో సభను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది.ఈ అంశాన్ని వచ్చే ఎన్నికల నాటికి సజీవంగా ఉంచేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అంశం అధికారపార్టీకి నష్టం కల్గించనుంది.అయితే కాంగ్రెస్ పార్టీ బలపడితే వైసీపీకి నష్టమే, కాగా, టిడిపికి మాత్రం కొంత సంతోషాన్ని కల్గిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిందనే కోపంతో గత ఎన్నికల్లో ఆ పార్టీ గుర్తుపై పోటీచేసిన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడ దక్కకుండా ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడించారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉండదనే అభిప్రాయంతో పార్టీ నుండి చాలామంది నాయకులు ఇతర పార్టీల్లో చేరారు.
కీలకమైన నాయకులంతా పార్టీని వీడడంతో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఒకానొకదశలో ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ దశ నుండి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయపరిస్థితులను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి తాము కూడ రంగంలో ఉన్నామనే భావన ప్రజల్లో కల్పించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతోంది.

ప్రత్యేక హోదా అంశంతో
ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక హోదా కంటే హోదాతో ఒనగూరే ప్రయోజనాలను రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం ప్రకటించింది.అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం వల్లే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతోందని విపక్షాలు చెబుతున్నాయి.ఈ విషయమై కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, టిడిపి కూటమిపై విరుచుకుపడుతున్నాయి. ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఆంధ్రప్రజల సెంటిమెంట్ గా విపక్షాలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సెంటిమెంట్ గా మారితే అధికారంలో ఉన్న పార్టీలకు నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.ఈ అంశాన్ని తీసుకొని అదికారపక్షాన్ని ఇబ్బందిపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయంగా టిడిపి , బిజెపిలకు ఈ అంశం నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ బలపడుతోన్నా నష్టం లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడితే నష్టం లేదని టిడిపి అభిప్రాయంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితే వైసీపీకి నష్టమేననే అభిప్రాయాన్ని టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా సభకు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ చేయడంతో టిడిపి నాయకులు సంబరపడుతున్నారు. వైసీపీ బలహీనపడుతోందని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకులకు చెప్పారు. వైసీపీ బలహీనపడుతున్నందునే కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని చెప్పారు.ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక తనకు కలిసివస్తోందని టిడిపి నాయకులు సంతోషంతో ఉన్నారు.

ప్రత్యేక ప్యాకేజీతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది.రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదాపై కేబినెట్ సమావేశంలో వచ్చిన నోట్ ను తిరస్కరించడమే కాకుండా రాబోయే మంత్రివర్గం సమావేశంలో పరిశీలించాల్సిందిగా సూచించారు.అయితే అదేరోజు కేబినెట్ లో ఆమోదించి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రత్యేక హోదా ఇవ్వడం కంటే హోదాతో ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇస్తోందని టిడిపి నాయకులు చెబుతున్నారు.హోదాతో కొత్తగా రాష్ట్రానికి వచ్చేదేమీ లేదని వారు అభిప్రాయంతో ఉన్నారు.

2019 ఎన్నికల అస్త్రం
రానున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన ప్రచార అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు. 2019 లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరు సభలో ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇస్తామని ప్రకటించారు. ఈ అంశాన్ని ప్రజల్లో సజీవంగా ఉంచడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. అయితే ఈ అంశం ఎంత ఎక్కువగా ప్రజల్లో చర్చ సాగుతోందో ఆ మేరకు అధికారపార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications