కిరణ్‌పార్టీపై ట్విస్ట్: పండుగ తర్వాత లగడపాటి పార్టీలోకి?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. సోమవారం శాసన సభ లాబీల్లో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు చూసినా ఈ నెల 23వ తేదీ తర్వాత కిరణ్ పార్టీ పెట్టే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం మాట్లాడుతూ... పార్టీ మారే విషయం ఇంకా నిర్ణయించుకోలేదని చెబుతూ, ఈ నెల 23వ తేదీ తర్వాత కిరణ్ జిల్లాల పర్యటన ఉంటుందని చెప్పారు. తద్వారా కొత్త పార్టీకి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
ఇక్కడో ట్విస్ట్ కూడా ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కొత్త పార్టీని కిరణ్ పెట్టరని, యూపిఏ ప్రభుత్వం పైన అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీలలో ఒకరు పార్టీ పెడితే, అందులో కిరణ్ చేరుతారంటున్నారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన వారిలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్నారు.

లగడపాటియే కొత్త పార్టీ పెట్టి కిరణ్‌ను ఆహ్వానించవచ్చునని అంటున్నారు. 23 తర్వాత భేటీ అవుదామని కిరణ్ చెప్పినప్పటికీ, లగడపాటి తన పార్టీని మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి.
పది రోజుల అనంతరం అంటే సంక్రాంతి పండుగ తర్వాత లగడపాటి పార్టీ పెడితే ఆ తర్వాత కొద్ది రోజులకు కిరణ్ చేరుతారట. జై సమైక్యాంధ్ర పార్టీ పేరు కొద్ది రోజుల క్రితం వినిపించిన విషయం తెలిసిందే. జై సమైక్యాంధ్ర పార్టీని కిరణ్ పెడుతున్నారని, పార్టీ వ్యవహారాలను లగడపాటి చూస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.
సమైక్య గళం వినిపిస్తున్న లగడపాటికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని, ఈ కారణంగా ఆయన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. 23వ తేదీ తర్వాత కిరణ్ పార్టీలో చేరాక పార్టీ అనూహ్యంగా పుంజుకోవచ్చునని భావిస్తున్నారట. అయితే, ఇదంతా వట్టిదేనని మరికొందరు కాంగ్రెసు నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications