ఆపరేషన్‌కు 'కొత్త' రంగు: బాబు-కెసిఆర్‌లది ఒకేమాట!, జగన్‌కు 6గురు షాక్?
హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 'ఆపరేషన్ ఆకర్ష్'తో ప్రతిపక్షాలు బిక్కచచ్చిపోతున్నాయి. ఓ వైపు విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వరుసగా అధికార పార్టీల్లోకి వెళ్తుంటే... విపక్షాలు ఏం చేయలేకపోతున్నాయి.
తెలంగాణలో కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ధాటికి తెలంగాణ టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు మిగిలింది ముగ్గురే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవైకి పైగా గెలిస్తే మిగిలింది పద్నాలుగు మంది. కేవలం మజ్లిస్, బిజెపిలు మాత్రమే ఆపరేషన్ ఆకర్ష్ భారిన పడటం లేదు.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్.. కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ప్రారంభమైంది. ఏపీలో మాత్రం కొద్ది నెలల క్రితమే ప్రారంభమై క్రమంగా ఊపందుకుంటోంది. ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్ 1, ఫేజ్ 2లుగా చెబుతున్నారు. ఇప్పటికే పదకొండు మందికి పైగా ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరారు.
తాజాగా, మరో ఆరుగురు వైసిపి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయానికి దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు టిడిపిలో చేర్పించుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. తద్వారా జగన్‌కు రాజ్యసభ సీటు విషయంలోను చెక్ చెప్పాలని భావిస్తోందట.

పార్టీలోకి వచ్చేవారికి, ఉన్న వారికి బాబు హామీ
పార్టీలోకి వచ్చేవారికి, ఇప్పటికే ఉన్న వారికి చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో కొత్తవారు, పాతవారు కలిసి పని చేయాలని సూచిస్తున్నారు. పార్టీ, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ చేరికలను అని చెబుతున్నారు.
కొత్త రాష్ట్రమైన ఏపీలో అభివృద్ధి జరగాలంటే.. అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి ప్రతిపక్షం సహకారం అవసరమని, కానీ జగన్ ఆ దిశలో ఆలోచించడం లేదని, అందుకే టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిందని అంటున్నారు. జగన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నందున ఆయన పైన ఇలా ఒత్తిడి తేవడంతో పాటు పార్టీ బలం కూడా పెంచేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారని అంటున్నారు.
చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ... అభివృద్ధిని కోరుకునే వారికి పార్టీలో చోటు ఉంటుందని, వైసిపి ఎమ్మెల్యేలు వస్తే స్వాగతిద్దామని చెబుతున్నారు. జగన్ నిరంకుశ వైఖరి వల్లనే వైసిపిని ఎమ్మెల్యేలు వీడుతున్నారని చెబుతున్నారు. మరో అరడజను మంది ఎమ్మెల్యేలు వైసిపి నుంచి వస్తారని అందుకు జగన్ వైఖరే కారణమని చెబుతున్నారని తెలుస్తోంది.
పాతవాళ్లు కొత్తవాళ్లతో కలిసి పోవాలని, పార్టీలో అందరికీ అవకాశాలిస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇందుకు ఓ కారణం కూడా ఉందనే విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ప్రకారం.. ఏపీలో నియోజకవర్గాలు 175 నుంచి 225కు పెరిగే అవకాశముందని అంటున్నారు.
నియోజకవర్గాలు పెరుగుతున్నందున పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలకు, పాతవారికి ఇరువురికి కూడా అవకాశాలు ఇవ్వవచ్చునని, అందరికీ టిక్కెట్లు ఇవ్వవచ్చునని, కాబట్టి వారి రాకను ఎవరూ వ్యతిరేకించవద్దని చంద్రబాబు సూచిస్తున్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులదీ ఒకేమాట!
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా తెలంగాణ, ఏపీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్నారు. తమ పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల విషయంలో ఇరువురు ముఖ్యమంత్రులు కూడా దాదాపు ఒకే మాటను పల్లె వేస్తున్నారు.
తెలంగాణ కొత్త రాష్ట్రమైనందున, దీనిని పునర్నిర్మించుకునే అవసరం ఉన్నందున రాజకీయ పునరేకీకరణలో భాగంగానే విపక్ష ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరుతున్నారని, అభివృద్ధి కోసం వారు చేరుతున్నారని తెలంగాణ సీఎం కెసిఆర్ చెబుతున్నారు.
చంద్రబాబు కూడా దాదాపు అదే మాట చెబుతున్నారు. ఏపీ కొత్త రాష్ట్రమని, విభజన వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని దాటి ఏపీని దేశంలో నెంబర్ వన్ చేయాలని, అందుకు ప్రతిపక్ష సహకారం అవసరమని, కానీ ఆ పార్టీ నుంచి సహకారం లేదని, జగన్ తీరును అర్థం చేసుకొనే, తాము అభివృద్ధి చేస్తున్నందున ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారని చెబుతున్నారు. అభివృద్ధి కోరుకునే తమ పార్టీలోకి వస్తున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలోను, ఏపీలోను నియోజకవర్గాల పునర్విభజన జరిగి సంఖ్య పెరుగుతుందని, కాబట్టి విపక్షాల నుంచి ఎమ్మెల్యేలు చేరినా పెద్దగా ఇబ్బంది ఉండదని ఇరువురు సీఎంలు కూడా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications