అసెంబ్లీ ప్రోరోగ్ కొత్త మలుపు: అక్కర్లేదన్న శ్రీధర్ బాబు
హైదరాబాద్: విభజన ప్రక్రియను జాప్యం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోరోగ్ అంశాన్ని తెర పైకి తీసుకు వచ్చారన్న అంశం కొత్త మలుపు తిరిగినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫైలును నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు ఈ ఫైలును పరిశీలించలేదు. శాసన సభ వ్యవహారాల మంత్రి హోదాలో శ్రీధర్ బాబు ఈ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి, అక్కడి నుంచి రాజ్ భవన్‌కు వెళితే గవర్నర్ ఉత్తర్వులు జారీ చేస్తే అసెంబ్లీ ప్రొరోగ్ అవుతుంది. దీంతో శ్రీధర్ బాబు ఫైలును తన వద్దే అట్టిపెట్టుకునే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

కాగా, అంతకుముందు హైదరాబాదులో శ్రీధర్ బాబు మాట్లాడారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రోరోగ్ చేయాల్సిన తరుణం ఇది కాదని వ్యాఖ్యానించారు. ప్రోరోగ్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను తాను మీడియాలో చూశానన్నారు. తెలంగాణా బిల్లుపై అతి వేగంగా చర్యలు కొనసాగుతున్న తరుణంలో రాష్టప్రతి ఏ క్షణంలోనైనా ఈ బిల్లును శాసనసభకు పంపించే అవకాశం ఉందన్నారు.
ఈ తరుణంలో సభను ప్రోరోగ్ చేయాల్సిన అవసరం లేదని, పైగా అత్యంత ముఖ్యమైన ఆర్డినెన్స్‌లు ఏవీ ఇప్పుడు లేవని అభిప్రాయపడ్డారు. అవసరం అయితే ఈ అంశంలో తెలంగాణ మంత్రులం గవర్నర్‌ను కలుస్తామని, ముఖ్యమంత్రిని కూడా కలుస్తామన్నారు. తెలంగాణా బిల్లు సజావుగా కొనసాగేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రాజ్యాంగపరంగా కూడా డిసెంబర్ 20లోగా అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుందన్నారు. అందుకు కొద్ది రోజులే గడువు ఉన్నందున ఈ సమయంలో ప్రొరోగ్ అవసరం లేదన్నది తెలంగాణ ప్రజాప్రతినిధుల భావనగా శ్రీధర్ బాబు చెప్పారు.












Click it and Unblock the Notifications