బీజేపీలోకి గంగిరెడ్డి - ఢిల్లీకి చేరిన పంచాయితీ..!!
ఏపీ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి దంపతులు బీజేపీలో చేరనున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకొనేందుకు రంగం సిద్దమైంది. కాగా గంగిరెడ్డి చేరిక ఆయన జిల్లా అన్నమయ్యలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో, పురందేశ్వరి వారి రాకను వాయిదా వేసారు. జిల్లా నేతలు అంగీకరిస్తేనే చేరిక ఉంటుందని స్పష్టం చేసారు.
అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. అయితే, అన్నమయ్య జిల్లా బీజేపీ నేతల నుంచి గంగిరెడ్డి చేరిక పైన అభ్యంతరం వ్యక్తం అయింది. రైల్వే కోడూరులో ఒక థియేటర్ యజమానుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. దీని పైన విచారించిన పోలీసులు ఆ తరువాత విడిచిపెట్టారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గంగిరెడ్డి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరొందారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో దాక్కున్న ఆయనను ఏపీ పోలీసులు అరెస్టు చేసితీసుకు వచ్చారు. జగన్ సర్కార్ వచ్చాక ఆయన బయటకు వచ్చారు. వైసీపీ హయాంలో అతను జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి అనేక సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో గంగిరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు.
బీజేపీలో చేరేందుకు మంతనాలు గంగిరెడ్డి పూర్తి చేసుకున్నారు. అయితే, అన్నమయ్య జిల్లా బీజేపీ నేతల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. గంగిరెడ్డి లాంటి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ఢిల్లీకి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీంతో, గంగిరెడ్డి పార్టీలో చేరటం లేదని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. పార్టీలో ఎవరు చేరాలని భావించినా జిల్లా నేతలు అంగీకరిస్తేనే చేర్చుకుంటా మని స్పష్టం చేసారు. దీంతో, ప్రస్తుతానికి గంగిరెడ్డి బీజేపీలో చేరిక నిర్ణయం వాయిదా పడింది.












Click it and Unblock the Notifications