భూమా బెయిల్ పిటిషన్ కొట్టివేత
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆళ్లగడ్డ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను కర్నూలు జిల్లా న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. భూమా జిల్లా కోర్టులో ఇటీవల బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు కొట్టి వేసింది. టీడీపీ కౌన్సిలర్ల పైన దాడి కేసులో ఆయన నవంబర్ 1 నుండి రిమాండులో ఉంటున్నారు.
కాగా, ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ గత నెలాఖరున తెలుగుదేశం పార్టీకి చెందిన చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైయస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ నేత వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు.

వారు వెనక కుర్చీల్లోకి వెళ్లాలని టిడిపి కౌన్సిలర్లు గొడవకు దిగారు. శివశంకర్ సమాధానం చెబుతుండగా ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్‌పర్సన్ హెచ్చరించారు. ఇంతలో సమావేశానికి భూమా నాగిరెడ్డి వచ్చారు. వివాదాన్ని తగ్గించడానికి అంటూ శివశంకర్ కుర్చీలో కూర్చోవాలని సూచించారు. గొడవ నేపథ్యంలో ఎజెండా చేపట్టకుండానే సమావేశం ముగిసిందని చైర్‌పర్సన్ ప్రకటించారు.
అయితే, భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడడం ప్రారంభించారు. అయితే, సమావేశం ముగిసిందని చైర్‌పర్సన్ బెల్ కొట్టారు. దాంతో పాటు ఆమె భర్త, కోఆఫ్షన్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి - ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదన్నారు. దీనికి వైయస్సార్ కాంగ్రెసు కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు.
దాంతో గొడవ ప్రారంభమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కుర్చీలు విసురుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications