Team India: టీమిండియా ప్రక్షాళన..! కోచ్ ల తర్వాత మరో వికెట్ రెడీ ..?
ఈ ఏడాది టీమ్ ఇండియా (Team India) విదేశాల్లో వరుస పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు దిగింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టు మేనేజ్ మెంట్ లో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ టీమ్ లో ఆయన తప్ప మిగిలిన వారెవరికీ గ్యారెంటీ లేని పరిస్ధితి. ఇదే క్రమంలో అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ లు తప్పుకున్నారు. ఇప్పుడు వీరి తర్వాత మరో వికెట్ పడేలా కనిపిస్తోంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.
టీమిండియాలో ఆటగాళ్లు తరచూ ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఓ సిరీస్ లో ఉంటే మరో సిరీస్ లో కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు ఫిట్ నెస్ వ్యవహారాలు చూస్తున్న ఫిజియో కమలేష్ జైన్ పై కత్తి వేలాడుతోంది. ఈ మధ్య కాలంలో హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. దీని వల్ల జట్టు కూర్పులో పలు మార్పులు చేయాల్సి వచ్చింది. టీమిండియా ఆటతీరుపై ఇది కూడా ప్రభావం చూపింది. దీంతో టీమ్ ఫిజియో కమలేష్ జైన్ ను తప్పించే అవకాశం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది.

2022లో నితిన్ పటేల్ స్థానంలో టీమిండియా ఫిజియోగా బాధ్యతలు స్వీకరించిన కమలేష్ జైన్‌పై జట్టు మేనేజ్ మెంట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు టైమ్స్ కథనం పేర్కొంది. ఈ విషయంపై పలు చర్చలు జరిగాయని కూడా తెలిపింది. తరచుగా ఫిజియోథెరపీ విఫలమవడంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. అందుకే హెడ్ ఫిజియో కమలేష్ జైన్ పాత్రతో పాటు, టీమ్ లోని ఇతర నిపుణుల పాత్రపైనా బీసీసీఐ నిఘా పెట్టింది. కెప్టెన్, కోచ్ ఇద్దరూ పూర్తిస్థాయి ప్లేయింగ్ ఎలెవన్ ను బరిలోకి దించడానికి తరచుగా ఇబ్బంది పడుతున్నారని, కనీసం 15 మంది ఆటగాళ్లే వారి మొదటి ఎంపిక కానప్పుడు, సరైన ప్లేయింగ్ కాంబినేషన్ గురించి ఎలా ఆలోచించగలరని బోర్డులో ఓ అధికారిని ఉటంకిస్తూ టైమ్స్ కథనం పేర్కొంది. జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్నందున, ఒక ఆటగాడు తన శరీరాన్ని ఎక్కువగా శ్రమకు గురిచేయాల్సి వస్తుందని, ఇక్కడే సహాయక సిబ్బంది, క్రీడా కమిటీ జోక్యం చేసుకోవాలని, వారు ప్రమాద సంకేతాలను జారీ చేయాలని, అంతేగానీ ఆటగాళ్లను తిరిగి మైదానంలోకి దించడానికి తొందరపడకూడదని నిపుణులు చెప్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండటం బోర్డును కలవరపెడుతోంది.














Click it and Unblock the Notifications