ఏపీలో కరోనా: దేశంలోనే టాప్2 - కొత్తగా 10,603 కేసులు, 88 మృతి - లక్ష యాక్టివ్ కేసులతో టెన్షన్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి జెట్ స్పీడ్ వేగంతో విస్తరిస్తున్నది. భారీగా చేపడుతోన్న టెస్టులకు అనుగుణంగా కొత్త కేసులు వెల్లువలా వస్తున్నాయి. యాక్టివ్ కేసుల పరంగా దేశంలోనే రెండో స్థానంలో కొనసాగుతోన్న ఏపీ.. ఆదివారం నాటికి మొత్తం కేసుల పరంగానూ తమిళనాడును అధిగమించి, దేశంలో రెండో స్థానానికి చేరింది.

వరుసగా ఐదో రోజు 10వేలకుపైగా..
ఏపీలో గత వారంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గినట్లే అనిపించినా, మళ్లీ విలయతాండవం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు 10 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు సైతం పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,603 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు పెరిగింది. మొత్తం 4.15లక్షల కేసులతో తమిళనాడు మూడో స్థానంలో, 7.64లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

మళ్లీ పెరిగిన మరణాలు..
కొత్త కేసుల సంఖ్యలాగే, కరోనా మరణాల సంఖ్యలోనూ పెరుగుదల కనిపించింది. శనివారం 82 మంది చనిపోగా, ఆదివారం ఆ సంఖ్య 88కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృత్యువాతపడగా, చిత్తూరులో 12 మంది, కడపలో 9 మంది, అనంతపురంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, ప్రకాశంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయినవారి సంఖ్య 3,884కు పెరిగింది.

5 జిల్లాలు అతలాకుతలం..
కొత్త కేసులు, మరణాలకు సంబంధించి ఏపీలోని ఐదు జిల్లాల్లో పరిస్థితి భయానకంగా మారింది. తూర్పు గోదావరిలో దాదాపు మూడు వారాలుగా ప్రతి రోజూ వెయ్యికిపైగా కొత్త కేసులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ 1090 కొత్త కేసులు, ఆరుగురు మరణించగా, మొత్తంగా కేసుల సంఖ్య 58,020కు, మరణాల సంఖ్య 384కు పెరిగింది. నెల్లూరులో కొత్తగా 1028 కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 979 కేసులు, ఏడు మరణాలు, చిత్తూరు జిల్లాలో కొత్తగా 948 కేసులు, 12 మరణాలు, కడపలో కొత్తగా 952 కేసులు, తొమ్మిది మరణాలు నమోదయ్యాయి.
Recommended Video

ఆందోళనకరంగా యాక్టివ్ కేసులు..
ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిళ్లను పరీక్ష చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 36.66లక్షల టెస్టులు చేపట్టారు. గడిచిన 24 గంటల్లో 9,067 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా రాష్ట్రంలో వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,21,754కాగా, యాక్టివ్ కేసులు మాత్రం కలవరపెట్టే స్థాయిలో ఉన్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంక్య 99,129గా ఉంది. యాక్టివ్ కేసుల్లోమహారాష్ట్ర(1,85,131) తర్వాతి స్థానం ఏపీదే.












Click it and Unblock the Notifications