కేంద్రపెద్దలకు జగన్ మసాజ్; ఇంట్లో ఈగల మోతలా జగన్ ప్రభుత్వ తీరు: సీపీఐ నారాయణ
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో దివంగత టిడిపి నేత ఆయన స్నేహితుడు అయిన కళ్ళం పానకాల రెడ్డి విగ్రహావిష్కరణకు వెళ్లిన సిపిఐ నేత నారాయణ, ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ కేంద్ర పెద్దలకు మసాజ్ లు చెయ్యటం మానుకోవాలి
విభజన హామీల తో పాటు, ప్రత్యేక హోదా లాంటి అనేక అంశాలతో కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని సిపిఐ నేత నారాయణ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం తో సీఎం జగన్ చర్చించాలని నారాయణ సూచించారు. ఇకనైనా కేంద్ర పెద్దలకు జగన్ మసాజ్ లు చేయడం మానుకోవాలని నారాయణ పేర్కొన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల కోసమే జగన్ ఢిల్లీకి.. ఇదే మంచి సమయం అన్న నారాయణ
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల కోసమే జగన్ ను ఢిల్లీకి పిలిపించుకుంటున్నారని, రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి ఇదే మంచి తరుణం అని నారాయణ తెలిపారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడని, ఒకవేళ వెళితే ఆయనే ముసుగు వేసుకున్న చందంగా మారుతుందని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ప్రజా వ్యతిరేకతతో టిడిపి సభలకు జనాలు బాగా స్వచ్ఛందంగా వస్తున్నారని సిపిఐ నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Recommended Video


జగన్ సర్కార్ పరిస్థితి ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత
ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలం అవసరం ఉందని, ఇప్పుడైనా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రం నుండి సాధించుకోవాలని సిపిఐ నారాయణ స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులు, బొగ్గు దిగుమతులు చేసుకోవడంపై రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తోందని సిపిఐ నారాయణ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతగా మారిందని నారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం ఉన్న జగన్ కేంద్ర ప్రభుత్వానికి బానిసగా మారాడని నారాయణ విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్టీఆర్ ఫెడరల్ స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలిచారని నారాయణ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications