ప్రధాని, చంద్రబాబు మంత్రాంగం - అమరావతి లో కీలక పరిణామం..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12న చంద్రబాబుతో సహా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అటు కేంద్రంలో ఈ రోజు ప్రధానిగా మూడో సారి మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కానుంది. రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఇక..ఏపీ రాజధాని అమరావతి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అమరావతిలో కదలిక
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీ రాజధాని విషయంలో ఈ సారి చంద్రబాబు తొలి రోజు నుంచే అడుగులు వేస్తున్నారు. కేంద్రంతో జత కట్టే సమయంలోనూ చంద్రబాబు ఇదే విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని మోదీతోనూ అమరావతి రాజధానిగా నిర్మాణం పైనే సాయం కోరినట్లు సమాచారం. మోదీ సైతం కేంద్రం నుంచి ఏపీకి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. దీంత, ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి మొదలైంది. జగన్ ప్రభుత్వంలో దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సీఆర్డీఏ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు.

క్లియరెన్స్ మొదలు
భారీ సంఖ్యలో పొక్లెయిన్లు, జేసీబీలను రప్పించి ఎక్కడికక్కడ ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ముళ్ల కంపలతో కమ్మేసుకుపోయిన రోడ్లు తిరిగి జీవం పోసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి పిచ్చి మొక్కలను తొలగించటంతో చాన్నాళ్లకు కళ కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో పనులు, నిర్మాణాలు నిలిచిపోయాయి. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్-1, టైప్-2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనులలో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్నీ పిచ్చిచెట్లతో కమ్మేసుపోయాయి. ఇక, ఇప్పుడు మళ్లీ అమరావతిలో కళ మొదలైంది.
చంద్రబాబు ప్రధాన ఫోకస్
ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తాళాలు తెరిచి బూజు దులుపుతున్నారు. ఈ సెంటర్ నలువైపులా విస్తరించి ఉన్న పొదలను తొలగిస్తున్నారు. ఉద్దండ్రాయునిపాలెంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు. అమరావతి పైన కొనసాగుతున్న న్యాయ పరమైన చిక్కులను తొలిగించుకుంటూ..ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో..అమరావతిలో తిరిగి భూముల ధరల పెరుగుదల మొదలైంది. భారీ అంచనాలతో అనూహ్య మెజార్టీ తో గెలిపించిన ప్రజలు ఇప్పుడు చంద్రబాబు తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తితో ఉన్నారు.












Click it and Unblock the Notifications