ఎపి రాజధాని, అసెంబ్లీలో సిఆర్‌డిఎ బిల్లు: ఫాస్ట్‌పై వ్యాఖ్యలపై రావెల
హైదరాబాద్: భూ సమీకరణపై సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. సీఆర్‌డీఏ ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ రాజధాని నిర్మాణం ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది.
దీనికి అనుగుణంగానే ల్యాండ్ పూలింగ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 19న సీఆర్‌డీఏ ముసాయిదా బిల్లును అధికారికంగా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లు ఆమోదముద్ర పొందిన వెంటనే భూ సమీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తెలంగాణ ఫాస్ట్ పథకంపై హైకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టానికి, రాజ్యాంగానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఇప్పటికైనా ఫాస్ట్ జీవో పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉమ్మడి అడ్మిషన్లలో నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో సీట్లు పొందిన ఆంధ్ర విద్యార్థులకు తాము ఫీజులు చెల్లిస్తామని మంత్రి రావెల మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఒకసారి ఈ పథకంపై కోర్టు తప్పుపట్టిందని, ఇప్పుడు మరోసారి ఫాస్ట్ జీవోను తప్పపట్టడాన్ని హర్షిస్తున్నామని ఆయన అన్నారు. ఆక్టికల్ 371 డికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడాలని ఆయన సూచించారు. పొరుగు రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని రావెల కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫాస్ట్ జీవోపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసి విషయం తెలిసిందే. సోమవారం ఫాస్ట్ జీవోపై దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఈ జీవో వేర్పాటువాద ధోరణిని ప్రోత్సహించేలా ఉందని పేర్కొంది. ఇలాంటి పథకం వల్ల ఈ ప్రాంతానికి రావడానికి ఇతర రాష్ర్టాల విద్యార్థులు సుముఖత చూపరని తెలిపింది.
ఒడిశా లాంటి పేదరాష్ర్టాల విద్యార్థులకు ఈ విధానం సహకరించదని కోర్టు తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమాధానమిస్తూ కేవలం మార్గదర్శకాలు రూపొందించడం కోసమే అధికారాలు ఇవ్వడం జరిగిందని, ఈ జీవోపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సంక్రాంతి తర్వాత వారం రోజుల పాటు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications