అమరావతిలో రెండో విడత భూములు ఇచ్చే రైతులకు సీఆర్డీఏ నయా ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు వేస్తుంది. రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికలో కీలక అడుగు వేస్తూ రెండవ విడత భూసేకరణను చేస్తోంది. రాజధాని అమరావతి విస్తరణ కోసం భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పనుంది.
రైతులందరికీ ఒకే చోట ప్లాట్లు
తొలి విడతలో భూ సేకరణ చేసిన రైతులకు ఇచ్చినట్టు కాకుండా, రెండవ విడతలో భూమిని ఇచ్చే రైతులకు ప్రభుత్వ రిటర్నబుల్ ప్లాట్స్ కేటాయించడానికి రెడీ అవుతోంది. ఈసారి తొలి విడత మాదిరిగా కాకుండా రైతులందరికీ ఒకే చోట ప్లాట్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇది ప్రస్తుతం ప్రణాళికలో ఒక ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు. ఇక ఈ విధానం పైన సిఆర్డిఏ కసరత్తు చేస్తోంది.

సీఆర్డీఏ ప్లాన్ లో మార్పులు అందుకే
రెండవ విడత ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు సిఆర్డిఏ ఒకే లే అవుట్ ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనికోసం అధికారులు ప్రణాళికలను సైతం రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదం కోసం అధికారికంగా సమర్పించనున్నారు. తొలి దశలో భూ సమీకరణలో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ దశలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ప్లాన్లో మార్పు చేస్తోంది సిఆర్డిఏ.
రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో సమస్య ఇదే
అప్పట్లో రైతులు తమ గ్రామాలలోనే రిటర్నబుల్ ప్లాట్లను డిమాండ్ చేయడంతో ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక లేఔట్ లను అభివృద్ధి చేసింది. దీని ఫలితంగా ప్రభుత్వానికి లభించిన భూమి వివిధ ప్రాంతాలలో చెల్లాచెదురుగా ఉండిపోయింది. భారీ ప్రాజెక్ట్ లకు భారీవిస్తీర్ణంలో భూమి అవసరం అయినప్పుడు ఒకేచోట లభించే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే ఎక్కువ లేఅవుట్లు చేయడం వల్ల ప్రతి లేఅవుట్ కు ప్రత్యేక మౌలికసదుపాయాలను కల్పించడం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది.
రెండో విడతలో ప్లాన్ మార్పు వెనుక కారణం ఇదే
ఈ అనుభవాల దృష్ట్యా ఇప్పుడు రెండో విడతలో భూములు ఇచ్చే రైతులకు అందరికీ ఒకే చోట ఇవ్వాలని సిఆర్డిఏ భావిస్తోంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం సేకరించిన భూమి భారీ ప్రాజెక్టుల కోసం కేటాయించడానికి వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి భారీ ప్రాజెక్టులకు ఈ భూమిని ఇవ్వడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదన
ఇక ప్రస్తుతం భూములు ఇస్తున్న రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసే త్వరగా అప్పగించాలని రైతులు కోరుతున్న నేపథ్యంలో ఒకే లే అవుట్ ను అభివృద్ధి చేసి అందించే నిమిత్తం ఆ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించడానికి సిఆర్డిఏ అధికారులు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications