Ambati Rayudu: ఏపీ రాజకీయాల్లోకి అంబటి రాయుడు ఎంట్రీ! ఏ పార్టీ నుంచి అంటే..?
హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. టీమిండియా తరపున, ఐపీఎల్‌లో రాణించిన ఈ క్రికెటర్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. అయితే, ప్రస్తుతం క్రికెట్‌కు ముగింపు పలికి రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు రాయుడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాల్లోకి రావాలని చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నా.. ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నట్లు రాయుడు తెలిపారు. కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది కూడా అప్పుడే తెలుస్తుందని రాయుడు వెల్లడించారు.

హైదరాబాద్‌లోనే క్రికెట్ కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తెలంగాణలో కాకుండా ఏపీలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని రాయుడు స్పష్టం చేశారు. కాగా, ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. అంబటిని తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరాలని రాయుడుకి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సిద్దిపేట సమీపంలో రాయుడు వ్యవసాయ భూమి ఉంది. ఈ క్రమంలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌తో రాయుడికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాయుడు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, తనను ఏ పార్టీ గానీ, నేత గానీ తనను ఇప్పటికైతే సంప్రదించలేదని రాయుడు తెలిపారు. రాజకీయ అరంగేట్రంపై తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఏపీ రాజకీయాల్లోకి అంబటి రాయుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆయన రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications