తుఫాను ముప్పు తప్పినా, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు- తాజా హెచ్చరికలు..!!
ఆక్వాన్ తీవ్ర తుఫాను ముప్పు ఏపీకి తప్పింది. అయితే, దిశ మార్చుకోవటంతో ఉత్తరాంధ్ర జిల్లాల పైన ప్రభావం మాత్రం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రోజు (శుక్రవారం) ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగిస్తోంది.
తీవ్ర తుఫాన్ 'అక్వాన్' ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఇది కోస్తాకు సమాంతరంగా పయనిస్తూ దక్షిణ ఒడిశా వైపు వెళ్లనుండడంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీవర్షాలు కురవనున్నాయి. పెను గాలులు వీయనున్నాయి. ఒడిసా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు అక్కడక్కడ కుంభవృష్టి కురుస్తుందని, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర తుఫాన్ గురువారం ఉదయం నుంచి సగటున గంటకు 15 నుంచి 17 కి.మీ. వేగంతో పయనిస్తూ సాయంత్రానికి నరసాపురానికి తూర్పున 380, కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 270 కి.మీ., గోపాలపూర్‌కు దక్షిణంగా 350 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ తో
కాగా, ప్రస్తుతం ఉత్తర వాయవ్యంగా పయనిస్తోందని, శుక్రవారం ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సరిహద్దుల్లోని గోపాల్‌పూర్‌కు తూర్పున తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. తీరం దాటేటప్పుడు తుఫాన్‌గా బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో గురువారం ఉదయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లని గాలులు వీస్తున్నాయి. చిరుజల్లులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రకు మరింత చేరువగా రానున్నందున గాలుల వేగం 90 నుంచి 110 కి.మీ.కు పెరుగుతుందని వివరించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.












Click it and Unblock the Notifications
