Cyclone Arnab: పవర్ కట్ కాకుండా బిగ్ ప్లాన్! రంగంలోకి 6 వేల మంది సిబ్బంది..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'అర్నాబ్' ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ సంపూర్ణంగా సన్నద్ధమైంది. ఈ మేరకు ఈపీడీసీఎల్ (EPDCL) ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడమే కాకుండా, సీఎండీలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. తుపాను కారణంగా విద్యుత్ వ్యవస్థకు ఎంత పెద్ద విఘాతం కలిగినా త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
6 వేల మంది సిబ్బంది రంగంలోకి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ప్రక్రియ నిరంతరాయంగా సాగేందుకు మొత్తం 6,000 మంది సిబ్బందిని విధుల్లోకి దించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఈపీడీసీఎల్ నుంచి 4,000 మంది, ఎస్‌పీడీసీఎల్ నుంచి 1,000 మంది, సీపీడీసీఎల్ నుంచి 1,000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ ఇతర అవసరమైన సామాగ్రిని సరిపడా అందుబాటులో ఉంచారు. ఈదురు గాలులకు విద్యుత్ లైన్లపై చెట్లు, కొమ్మలు కూలిపడితే వాటిని తక్షణమే తొలగించి దారి సుగమం చేసేందుకు వీలుగా ఆధునిక యంత్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

150 కి.మీ వేగంతో బలమైన గాలులు
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం 'అర్నాబ్' తీవ్ర తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది అక్టోబర్ 28న ఉదయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల గాలుల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, అధికారులు వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.
24 గంటలు అందుబాటులో 1912 కాల్ సెంటర్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి
తుపాను సమయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ ఆస్తి నష్టాలను వీలైనంత వరకు నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. ఈదురు గాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను, కండక్టర్లను ఎవరూ చేతులతో తాకకూడదని, తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు ఏ చిన్న విద్యుత్ సమస్య ఎదురైనా తక్షణమే ఫిర్యాదు చేసేందుకు 1912 కాల్ సెంటర్‌ను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని సీఎండీని ఆదేశించారు. ఒకేసారి 30 వేలకు పైగా కాల్స్ స్వీకరించేలా ఈ టోల్ ఫ్రీ వ్యవస్థను అధికారులు సంసిద్ధం చేశారు. రెవెన్యూ, గ్రామ సచివాలయాలు, ఇతర శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా నిలవాలని మంత్రి ఆదేశించారు.














Click it and Unblock the Notifications
