అర్నబ్ తుఫాన్ ఉగ్రరూపం.. 32 వేల మంది అధికారులతో సీఎం అత్యవసర రివ్యూ
రాష్ట్రంపై 'అర్నబ్' తుఫాన్ విరుచుకు పడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు తీస్తున్నారు. తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై ఆయన ఏకంగా 32 వేల మంది ప్రభుత్వ అధికారులతో విస్తృత స్థాయిలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రత్యక్షంగా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, ఇరిగేషన్, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
అధికార యంత్రాంగం రాత్రంతా శ్రమించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా అడ్డుకోగలిగామని, ఇదే స్ఫూర్తితో ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత మేర తగ్గించేలా శ్రమించాలని అధికారులకు సూచించారు. రాత్రంతా కష్టపడి పనిచేసిన సిబ్బందిని అభినందించిన సీఎం, సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు విశ్రమించవద్దని ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు 'మేమున్నాం' అనే భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్
మరొకవైపు, అర్నబ్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. నరసాపురానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో నిలకడగా కొనసాగుతోంది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, తుఫాన్ వాల్ క్లౌడ్ వెనుక భాగం కూడా కోస్తా తీరంలోకి ప్రవేశిస్తోందని, మధ్యాహ్నానికి ఇది పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు
ఈదురుగాలుల కారణంగా రహదారులపై కూలిన చెట్లను రెండు గంటల్లోగా తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జాతీయ రహదారులపై సమస్య ఉత్పన్నమైతే రియల్ టైమ్‌లోనే క్లియర్ చేయాలని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా విద్యుత్ నిలిపివేసిన ప్రాంతాల్లో గాలుల తీవ్రత తగ్గగానే వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. సహాయక పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలలో ఎటువంటి లోటు రాకుండా చూడాలన్నారు.
పంట నష్టంపై కన్ను.. ఆర్డినరీ రీతిలో సాయం!
పొలాల్లో నీరు నిలవకుండా, ఉద్యాన పంటలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. డ్రెయిన్లకు, చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా నిఘా ఉంచాలన్నారు. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తీసుకుంటున్న నివారణా చర్యలను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరించాలని అధికారులకు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచామని, ప్రజలు తమ సమస్యల పరిస్కారం కోసం ప్రభుత్వ 'మనమిత్ర' వ్యవస్థను వినియోగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.














Click it and Unblock the Notifications
