ఆర్ణబ్ తుఫాన్ విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఏపీ తీరం కకావికలం
ఊహించినట్టే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్ణబ్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ వేకువ జామున 2:30 నుంచి 3 గంటల సమయంలో నరసాపురం- యానాం సమీపంలో తీరాన్ని తాకిన తుఫాన్ తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో కనిపించింది. ఉత్తరాంధ్ర, కోస్తా తీరం మొత్తం అల్లకల్లోలమైంది. భారీగా కోతకు గురైంది. అనేక చోట్ల సముద్రం కొన్ని మీటర్ల పాటు ముందుకు చొచ్చుకొచ్చింది. కోస్తా జిల్లాలకు కంటి మీద కునుకులేకుండా చేసింది.
ఈ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. తీరంలో అలలు 1.5 నుంచి 2.5 మీటర్ల ఎత్తువరకు ఎగిసిపడ్డాయి. ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మూడు గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్.. తీరానికి సమీపించిన సమయంలో దాని వేగం మందగించింది. గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో కదిలింది. కేటగిరి 3 గా గుర్తించింది ఐఎండీ. తీరాన్ని తాకిన తర్వాతా భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావం కొనసాగుతుందనిడీ పేర్కొంది.

దీని ధాటికి కాకినాడ జిల్లా చివురుటాకులా వణికిపోయింది. జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గంటకు 125-135కిమీ వేగంతో ఈదురుగాలులు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈదురుగాలుల తీవ్రత అధికంగా కనిపించింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. అనేక ప్రాంతాల్లో అంధకారం ఏర్పడింది.
మచిలీపట్నంలోని డాప్లర్ వెదర్ రాడార్ ద్వారా ఈ తుఫాన్ కదలికలను ఐఎండీ పర్యవేక్షించింది. తీరం దాటే ఈ ప్రక్రియ రాబోయే కొన్ని గంటల పాటు కొనసాగనుందని స్పష్టం చేసింది. కాకినాడ, యానాం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కాకినాడ వీధులు జలమయం అయ్యాయి. ఈదురుగాలుల ధాటికి ఇళ్లపైకప్పులు ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవహించింది.
కాకినాడ శివార్లలోని పగడాలపేట తుఫాన్ తీవ్రతకు భారీగా నష్టపోయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంతవాసులను ఇక్కడి పునరావాస కేంద్రాలకు తరలించారు. వాటిల్లో కూడా వర్షపు నీరు చేరినట్లు సమాచారం అందింది. అటు విశాఖపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ చెట్లు కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. వాటిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తూ వచ్చారు.
తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతోన్నాయి. వీటి తీవ్రత.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలపై అధికంగా ఉంటోంది. దక్షిణ కోస్తా తీరంపైనా తుఫాన్ ప్రభావం పడింది. ఇక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది.














Click it and Unblock the Notifications
