తుఫాన్ ధాటికి ఏపీ తీర ప్రాంత గ్రామాల్లో చొచ్చుకొచ్చిన కెరటాలు: బయటకు రావొద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్ణబ్ తుఫాన్.. మహోగ్ర రూపాన్ని దాల్చుతోంది. క్రమంగా అది పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఏపీ తీరానికి సమీపిస్తోంది. బుధవరం ఉదయం ఏపీలోని బాపట్ల- విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాన్ ముప్పు తీవ్రంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు ఇదివరకే హెచ్చరించారు. ఏపీ తీరంపై తుఫాను ప్రత్యక్ష ప్రభావం చూపతోండటంతో అధికార యంత్రాంగం రక్షణ చర్యలను వేగవంతం చేసింది. సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుండటంతో తీరాన్ని ఖాళీ చేయించింది. తీర ప్రాంత ప్రజలను శిబిరాలకు తరలించింది. మత్స్యకార గ్రామాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేసింది.

ఈ తుఫాన్ 18 కిమీ వేగంతో తీరం వైపు కదులుతోంది. ఈ సాయంత్రం 5 గంటల సమయానికి విశాఖపట్నం- 170, కాకినాడ- 140, మచిలీపట్నం- 230, బాపట్ల- 300 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. బుధవారం ఉదయం నాటికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం దాటే సమయంలో 125-135 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.
ఆ సమయంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది విపత్తు నిర్వహణ సంస్థ. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది. కాగా.. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడుతోన్నాయి. వీటి తీవ్రత.. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలపై అధికంగా ఉంటోంది. దక్షిణ కోస్తా తీరంపైనా తుఫాన్ ప్రభావం పడింది. ఇక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది.
కాకినాడ జిల్లా పొలెకుర్రులో సముద్రం 300 మీటర్లు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. పొన్నాడ- 200, పేరుపాలెం- 190, జీ వేమవరం- 180 మీటర్ల మేర ముందుకు చొచ్చుకు రావొచ్చు. ఉప్పాడ- కాకినాడ మార్గంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది కూడా. ఉవ్వెత్తిన ఎగసిన కెరటాలకు ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. మత్స్యకార గ్రామాలు జలమయం అయ్యాయి. తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
పిఠాపురం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. కెరటాల తీవ్రతకు అడ్డుగా పెట్టిన ఇసుక మూటలు సైతం కొట్టుకుపోయాయి. మత్స్యకార గ్రామాల్లో సముద్రపు నీళ్లు ప్రవహించాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. 29వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.















Click it and Unblock the Notifications
