మచిలీపట్నానికి సమీపంలో.. అతి తీవ్ర తుఫాన్
బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రోజురోజుకూ బలపడింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ విజృంభిస్తోంది. క్రమంగా తీవ్ర తుఫాన్ గా, తదనంతరం అతి తీవ్ర తుఫాన్ గా మారబోతోంది. అనంతరం క్రమంగా ఇది కోస్తాంధ్ర తీరం వైపు కదలుతుందని శుక్రవారం నాటికి తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనావేశాయి. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని వివరించాయి.
ప్రస్తుతం ఈ తుఫాన్.. బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఆరు గంటల వ్యవధిలో మూడు కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది.. చెన్నైకి తూర్పున 590, శ్రీలంకలోని ట్రింకోమలికి ఈశాన్యంగా 600, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 620, విశాఖపట్నానికి దక్షిణ- ఆగ్నేయ దిశలో 620, ఒడిశాలోని గోపాల్ పూర్ కు దక్షిణంగా 750 కిలో మీటర్ల దూరంలో ఉంది.

క్రమంగా ఇది పశ్చిమ- వాయవ్య దిశలో ప్రయాణిస్తూ గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనంతరం అదే దిశలో ప్రయాణిస్తూ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం సమయానికి తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది. నెల్లూరు- తుని- యానాం వద్ద తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమయంలో అతి తీవ్ర తుఫాన్ గా మారుతుందని, గంటకు 120-130, గరిష్టంగా 145 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తోన్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత అధికం కానుంది. వీటివల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చు. వీటితో పాటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదు కానున్నాయి.












Click it and Unblock the Notifications
