డీఎస్ లేఖ, సీమలో: రాజధానిపై పరిటాల సునీత ట్విస్ట్
హైదరాబాద్/కర్నూలు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి కాంగ్రెసు పక్ష నేత డీ శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యకర్తలకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ఓటమిని మర్చిపోయి కలిసి పని చేద్దామన్నారు.
రాయలసీమలో రాజధాని బాగుంటుంది: పరిటాల సునీత
రాయలసీమలో రెండో రాజధాని ఉంటే బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వేరుగా అన్నారు. రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండే బాగుంటుందని, అయితే రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. బుధవారం ఆమె అనంతపురం నుండి కర్నూలుకు వచ్చారు. రైతు బజార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కర్నూలు జిల్లాతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

2009లో వరదలు వచ్చినప్పుడు కర్నూలు నగరంలోని పలు గ్రామాలను దత్తత తీసుకొని పరిటాల రవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు సేవలు అందించామన్నారు. తాను మంత్రిగా మొదటిసారి జిల్లాకు వచ్చానని చెప్పారు. ధరల నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు.
విభజన చట్టాల అంశంపై కేంద్రానికి లేఖ
పునర్విభజన చట్టంలో చోటుచేసుకున్న లోపాలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వేరుగా తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ముగిశాయన్నారు. తమ అభ్యంతరాలతో కూడిన సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.
ఆగస్టు రెండో వారం నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్నారు. సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఏపీ శాసన మండలిలో 58 స్థానాలుండేలా చూడాలని కేంద్రాన్ని కోరతామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 8 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు యనమల తెలిపారు. ఆరు నెలలపాటు వాటిని తాత్కాలికంగా ఉంచుతామని, ప్రత్యేక సిబ్బంది ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications