YCP vs BJP: గుడివాడ నుంచి బరిలో పురంధేశ్వరి??
భారతీయ జనతాపార్టీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి గుడివాడ నుంచి రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు సొంత నియోజకవర్గమైన గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధేశ్వరిని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం.

పురంధేశ్వరి పోటీచేస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాపై ప్రభావం?
ఈ విషయం గురించి ముందుగానే ఉప్పందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహంలో భాగంగానే కొడాలి నానిద్వారా విమర్శల దాడి చేయించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గుడివాడ నుంచి పోటీచేస్తే ఆ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై చూపిస్తుందని వైసీపీ ఆందోళ చెందుతోంది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు, పురంధేశ్వరిని వెనకడుగు వేయించేందుకే ఇలాంటి వ్యూహాలను ఆ పార్టీ అవలంబిస్తోందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.

తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది!
పురంధేశ్వరి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని నాని హెచ్చిరించిన సంగతి తెలిసిందే. గుడివాడ అభివృద్ధిని పురంధేశ్వరి అడ్డుకుంటున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరయ్యాయని, కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని, ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని, ఆమె తన ప్రయత్నాలు మానకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

నాని వ్యాఖ్యలపై పురంధేశ్వరి మౌనం
నాని వ్యాఖ్యలపై ఇప్పటివరకు పురంధేశ్వరి మౌనంగానే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికవడమే ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని, అటువంటిది వారి కుటుంబ సభ్యులపై కారుకూతలు కూస్తే ఈసారి కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవనీయమని హెచ్చరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ నుంచి కొడాలి నాని పోటీచేస్తారు. అయితే ఆయనకు ప్రత్యర్థిగా వంగవీటి రాధా ను బరిలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది. ఇప్పుడు వీరిద్దరితోపాటు పురంధేశ్వరి కూడా రంగంలోకి దిగితే ఓట్ల చీలిక వచ్చి తనకు నష్టం వస్తుందనేది కొడాలి నాని అభిప్రాయంగా ఉంది. అందుకే ఆయన ముందస్తుగా పురంధేశ్వరిపై దాడిచేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.