నేచురల్ హెరిటేజ్ డేంజర్ వార్నింగ్ : రాజధానిగా అమరావతి అన్ ఫిట్
రాజధాని అమరావతి నిర్మాణంపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. మొన్నటిదాకా అమరావతిలో రాజధానిని నిర్మించడం సరికాదని పర్యావరణ శాఖ అడ్డు చెప్పితే..! తాజాగా డిల్లీకి చెందిన నేచురల్ హెరిటేజ్ ఫస్ట్ సంస్థ కూడా రాజధానిగా అమరావతిని ఎంచుకోవడం సరైన చర్య కాదని బాంబు పేల్చింది.
ప్రొఫెసర్ విక్రమ్ సోని ఆధ్వర్యంలో అమరావతిని సందర్శించిన నేచురల్ హెరిటేజ్ బృందం, రాజధాని కోసం ప్రభుత్వం తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను స్టడీ చేసింది. అనంతరం ప్లాన్ పై అభ్యంతరాలను వ్యక్తం చేసిన బృందం ఇదే ప్లాన్ ను అనుసరిస్తూ రాజధానిలో నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో భారీ ముప్పు తప్పదని హెచ్చరించింది.

దీనిపై మరింత వివరణ ఇస్తూ.. రాజధానిని ఆనుకుని ఉన్న నదికి ఇరువైపులా రెండున్నర కిలో మీటర్ల వరకు భారీగా ఇసుక పేరుకుపోయి ఉందన్నారు. అంచనా ప్రకారం సుమారుగా 40 మీటర్ల లోతు వరకు ఇసుక పొరలే ఉన్నాయని చెప్పిన బృందం ఇలాంటి చోట నిర్మాణాలు చేపట్టడం ఏమాత్రం సహేతుకం కాదని స్పష్టం చేసింది. నదిలో ప్రవాహం ఎక్కువైతే ఇసుక పొరల్లోకి నీరు చొరబడి, సమీపంలోని నిర్మాణాలు నేలమట్టం అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.
అంతేగాక, నదికి సమీపంలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా.. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదముందని, ఇది పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లేలా చేస్తోందని నేచురల్ హెరిటేజ్ బృందం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications