నేడు దుర్గమ్మ దివ్య దర్శనం టికెట్లు విడుదల! ధర ఎంతంటే..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో వీఐపీల సిఫార్సు లేఖలు, రికమండేషన్లతో సంబంధం లేకుండా సామాన్య భక్తులు నేరుగా, సులభంగా అమ్మవారిని దర్శించుకునేలా దేవస్థానం పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. "జగన్మాత దివ్య దర్శన్" పేరిట ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఈవో వీకే శీనా నాయక్ వెల్లడించారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ దసరా ఉత్సవాల్లో రోజుకు 1,000 చొప్పున మాత్రమే ఈ ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ (9552300009) ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. భక్తులు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే స్వయంగా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో తెలిపారు.

ఉచిత రవాణా.. బంగారు వాకిలి వద్ద దివ్య దర్శనం
ఈ ప్రత్యేక దర్శన టికెట్ రుసుమును రూ. 1,000గా నిర్ణయించారు. టికెట్ పొందిన భక్తులకు కుమ్మరిపాలెం సెంటర్లోని టీటీడీ స్థలం నుంచి కొండపైకి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కొండపై ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ గుండా భక్తులను అనుమతించి, అమ్మవారి సన్నిధిలోని బంగారు వాకిలి (ముఖ మండపం) వద్ద నుంచి అత్యంత సమీపంగా, వేగంగా దర్శన భాగ్యం కలిగిస్తారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అనుమతి
ఉత్సవ దినాల్లో రోజువారీ నివేదనలు, నైవేద్య సమయాలు మినహాయించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ "జగన్మాత దివ్య దర్శన్" కొనసాగుతుంది. మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా భక్తులు నేరుగా వాట్సాప్ సేవలను ఉపయోగించుకుని టికెట్లు పొంది, కేటాయించిన సమయానికి వచ్చి దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని దేవస్థాన అధికారులు కోరారు.














Click it and Unblock the Notifications
