TTD: తిరుమలలో భద్రతపై కీలక నిర్ణయాలు - ఇక నుంచి ఇలా..!!
Tirumala: ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు విచ్చేసి మహా పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో భద్రతను ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ ఖరారు చేసారు. మాడవీధుల్లో సాయుధ బలగాల నిఘాకు నిర్ణయించారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. భద్రతా పరమైన అంశాలపై కమిటీలను ఏర్పాటు చేసారు. విలువైన సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా అత్యున్నత సైబర్ సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు.
సెక్యూరిటీ ఆడిట్:తిరుమలలో భద్రతపైన ఉన్నత స్థాయి సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. మహిళా సిబ్బంది కొరతను తీర్చడానికి శిక్షణతో కూడిన మహిళా కాంటింజెంట్ ను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. తిరుమలలో విధులు నిర్వర్తించే పోలీసు వారికి ప్రత్యేకమైన శిక్షణను అందించే ఏర్పాట్లు చేయనున్నారు. అలిపిరి సప్తగిరి టోల్గేట్ వద్ద వాహనాలను, ఉద్యోగస్తులను, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే తిరుమలకు అనుమతించాలని డిసైడ్ అయ్యారు. భక్తుల వద్ద నుండి అక్రమ వసూళ్లు చేసే దళారీల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు. కాలానుగుణంగా ఏర్పడే సరికొత్త సవాళ్లను ఎదుర్కోడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, తగిన విధంగా అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తామని హోం కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.

సైబర్ దాడుల కట్టడికి:తిరుమల పరిపాలనలో దర్శన టికెట్ల దగ్గర నుంచి అద్దె గదుల వరకు ప్రతీ విభాగంలో భక్తుల ఆధార్ కార్డు డేటా అనుసంధానం చేస్తున్నారు. దీంతో సైబర్ దాడులు జరగకుండా భక్తుల సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు అత్యున్నత సైబర్ సెక్యూరిటీ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీవారి మాడవీధుల్లో 24/7 యాక్సెస్ కంట్రోల్ ఉండేలాగా ఏర్పాటు చేస్తూ అవసరమైన బీడీ టీం, సాయుధ దళాలను ఏర్పాటు చేసి, మూడు అంచెల భద్రత వ్యవస్థలో భాగమైన మూడో అంచె భద్రత వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. సోషల్ మీడియాలో ఫేక్ వెబ్ సైట్లు తిరుమల క్షేత్రం గురించి చేస్తున్న విషప్రచారాన్ని అరికట్టడానికి, ఒక ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ నిపుణులతో కూడిన సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
నిరంతర నిఘా:శ్రీవారి బూందీ పోటు, శ్రీవారి ఆలయం ప్రసాద తయారీ కేంద్రాల వద్ద తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫైర్ అలారం సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సరికొత్త ఫైర్ నియంత్రణ పరికరాలను శ్రీవారి ఆలయం బూంది పోటు వంటి చోట్ల ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో వాటిని ఎలా ఉపయోగించాలో అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బందికి తగిన శిక్షణ ఇస్తామని వెల్లడించారు. తిరుమలలో శాంతి భద్రతలను కాపాడుటకు నిరంతరం క్రైమ్ పార్టీ, ఐడి పార్టీలను బృందాలుగా ఏర్పాటు చేసి పిక్ పాకెట్, చిన్న పిల్లల కిడ్నాప్ వంటి నేరాలు జరగకుండా ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications