చంద్రబాబునాయుణ్ని ఓడించడంకన్నా ఆ ఎమ్మెల్యేను ఓడించడమే కష్టం??
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలు హోరాహరీగా సాగనున్నాయనే విషయం సుస్పష్టం. మొత్తం 175 నియోజకవర్గాలను గెలుచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా నిర్ధేశించుకోవడంతో గత ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినవాటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించగలిగితే ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని వైసీపీ భావించింది. స్థానికంగా బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించడంద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించింది. కుప్పం నుంచి చంద్రబాబును ఓడించడంకన్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడును ఓడించడమే కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వైసీపీ చెమటోడ్చాల్సి ఉంటుందన్నారు.

కొరకరాని కొయ్యగా మారిన నిమ్మల!
రామానాయుడు వైసీపీకి పాలకొల్లులో కొరకరాని కొయ్యగా మారారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. వైసీపీ గాలి ఉధృతంగా వీచినప్పటికీ 2014 ఎన్నికలకన్నా మరింత ఎక్కువ ఓట్లను నిమ్మల 2019 ఎన్నికల్లో సాధించారు. 17,809 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీపై విజయం సాధించారు. నిమ్మలకు 67,549 ఓట్లు రాగా, డాక్టర్ బాబ్జీకి కేవలం 49,740 ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేన తరఫున పోటీచేసిన గున్నం నాగబాబుకు 32,984 ఓట్లు వచ్చాయి. నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేయడమే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారిందని, ఈ మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలో నిమ్మల తన పట్టును మరింత పెంచుకున్నారనే అభిప్రాయం కూడా స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

చంద్రబాబు తర్వాత నిమ్మల పేరే వినిపించింది!
కుప్పంలో చంద్రబాబును ఓడించడంకన్నా పాలకొల్లులో నిమ్మలను ఓడించడమే కష్టమని, అందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుందంటున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపొందిన రామానాయుడు నియోజకవర్గంలో కలియదిరుగుతూ తన వ్యక్తిగత శైలితో బలం పెంపొందించుకోవడమేకాకుండా పార్టీ బలాన్ని పెంచుతున్నారు. ఈ మూడు సంవత్సరాల్లో ఆయన వైఎస్ జగన్ ప్రభుత్వంపై తవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూడా ఆయనపై పలు కేసులు నమోదు చేసింది. ఒకానొక సమయంలో చంద్రబాబు తర్వాత రామానాయుడి పేరే ఎక్కువగా వినపడిందంటే అతిశయోక్తి కాదు.

గత ఎన్నికల్లో టీడీపీ గెలుపొందినవాటిపై ప్రత్యేక దృష్టి
వైసీపీ తాను నిర్ధేశించుకున్న 175 నియోజకవర్గాల లక్ష్యాన్ని చేరుకోవాలంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందిన సీట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి, వైసీపీ పరిస్థితిపై ఒక నివేదిక రూపొందించుకొని ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయడమే దీనికి పరిష్కారమంటున్నారు. అప్పుడే రామానాయుడిని ఓడించడటం సులభమవుతుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications